రైతులపై తప్పుడు కేసులు ఎత్తివేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతులపై తప్పుడు కేసులు ఎత్తివేయాలి

Jul 16 2026 5:30 AM | Updated on Jul 16 2026 5:30 AM

సాక్షి,బళ్లారి: రైతులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, బిడది టౌన్‌షిప్‌ అభివృద్ధి పేరుతో వ్యవసాయ భూముల స్వాధీన ప్రక్రియను నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 17న బెంగళూరు ఫ్రీడం పార్కులో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర పేర్కొన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బిడది ప్రాంతంలో భూసేకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో మహిళలు అధికారులను చీపుర్లతో తరిమే పరిస్థితి ఏర్పడిందంటే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ పదవిలోకి వచ్చిన తర్వాత రైతులపై వేధింపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక పరిధిలో రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. కేఆర్‌ఎస్‌ డ్యాంలో నీరు లేకపోయినా కావేరి జలాలను విడుదల చేయడం క్షమించరాని నేరం అన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతాం

ఆగస్టు 6 నుంచి ప్రారంభం అయ్యే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో బీజేపీ, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారన్నారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)లో ప్రతి ఒక్కరూ తమ పేరు నమోదు చేయించుకోవాలన్నారు. ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కోసం ఏ విధంగా శ్రమిస్తామో అదే రీతిగా ఓటర్ల జాబితా ప్రక్రియను ఓటర్లు తమ ఫాం తీసుకొని సక్రమంగా అందించాలన్నారు. ఇది 20 ఏళ్లకు సంబంధించిన భవిష్యత్తు ఓటర్లకు అన్వయిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమించాలన్నారు.

డీకే సీఎం కావడం రాష్ట్ర ప్రజల కల కాదు

ముఖ్యమంత్రి పదవి అనేది కేవలం డీకే శివకుమార్‌ వ్యక్తిగత కల, కోరిక మాత్రమే తప్ప కర్ణాటక ప్రజల ఆకాంక్ష కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై.విజయేంద్ర ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ(సర్‌)పై జిల్లా పార్టీ పదాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను, ఉత్తర కర్ణాటక అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. బిడదిలో రైతులను కేవలం 24 గంటల్లో ఖాళీ చేయించి టౌన్‌షిప్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని దుయ్యబట్టారు. విధాన పరిషత్‌ సభ్యుడు వైఎం.సతీష్‌, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, బీజేపీ ప్రముఖురాలు గాలి లక్ష్మీ అరుణ, మాజీ ఎంపీ సన్నఫక్కీరప్ప, మాజీ ఎమ్మెల్యే సురేష్‌బాబు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బిడది భూస్వాధీనాన్ని రద్దు చేయాలి

17న బెంగళూరు ఫ్రీడం పార్కులో ధర్నా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై.విజయేంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement