తుమకూరు: గిన్నిస్‌బుక్ రికార్డు నెలకొల్పాలనే లక్ష్యంతో తుమకూరుకు చెందిన ముగ్గురు యువకులు 12 జ్యోతిర్లింగాల దర్శనం, కన్యాకుమారి మీదుగా కశ్మీర్ వరకు సుమారు 18 వేల కిలోమీటర్ల బైక్ యాత్రకు నాంది పలికారు. పవన్ కుమార్, చందు, గగన్‌లు గణపతి ఆలయంలో పూజలు చేసి బయల్దేరారు. స్థానిక ప్రజలు వారి యాత్ర జయప్రదం కావాలని ఆశీర్వదించారు. పవన్ కుమార్ గతంలో బైక్‌లో నేపాల్ వెళ్లి ఒక రికార్డు నెలకొల్పాడు. కన్యాకుమారికి వెళ్లి అక్కడి నుంచి కశ్మీరుకు ప్రయాణిస్తారు. మధ్యలో జ్యోతిర్లింగ క్షేత్రాలను కూడా దర్శిస్తామని తెలిపారు.
గంధపు చెక్కల స్వాధీనం
దొడ్డబళ్లాపురం: బాగలకోట జిల్లా బీళగి తాలూకా అటవీశాఖ అధికారులు 450 కేజీల గంధం చెక్కలు స్వాధీనం చేసుకున్నారు. తాలూకా పరిధిలోని ప్రసిద్ధి చెందిన చింకార అరణ్యంలో అడవి దొంగలు గంధం చెట్లను నరికి చెక్కలుగా చేసి రహస్య ప్రదేశంలో దాచి ఉంచారు. ఇది తెలిసి అధికారులు దాడి చేసి పలువురిని అరెస్టు చేశారు. 450 కేజీల గంధం చెక్కలను సీజ్ చేశారు. పట్టుబడినవారు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు చెందినవారుగా గుర్తించారు. వీరు అంతర్జాతీయ స్థాయిలో గంధం చెక్కల స్మగ్లింగ్ చేస్తున్నట్టు అనుమానాలున్నాయి. డీసీఎఫ్ స్వప్నిల్, ఏసీఎఫ్ ప్రదీప్ రాథోడ్, సిబ్బంది పాల్గొన్నారు.
భారీ కింగ్ కోబ్రా పట్టివేత
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హొరట్టి వద్ద గౌడహళ్లి గ్రామంలో 15 అడుగుల భారీ కింగ్ కోబ్రా కనిపించింది. ప్రదీప్ ఇంటి పరిసరాల్లో పామును చూసి ఇంటివారు భయాందోళనకు గురయ్యారు. దానిని చూసి జనం పరుగులు తీశారు. పాములను పట్టుకునే మొహమ్మద్‌కు సమాచారం ఇచ్చారు. మొహమ్మద్ వచ్చి చాకచక్యంగా పెద్ద పామును గంట పాటు కష్టపడి పట్టుకున్నారు. అంత ప్రమాదకరమైన పామును మెడలో వేసుకుని విన్యాసాలు చేయడంతో అందరూ సంభ్రమానికి లోనయ్యారు. అటవీశాఖ సూచనల ప్రకారం చార్మాడి అటవీ ప్రాంతంలో పామును వదిలేశారు. వానాకాలం కావడంతో పాములు బయటకు వస్తుంటాయని, వాటిని చంపకూడదని ఆయన అన్నారు.
తారు కడలిపాలు
యశవంతపుర: పడవలో తరలిస్తున్న తారు సముద్రంలోకి కలిసిపోయిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా కార్వార బైతకోల్ బందరులో జరిగింది. వేల లీటర్లు తారు కడలి పాలైంది. పడవలోంచి తారును అన్‌లోడ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ తారు గల్ఫ్ నుంచి ఓడలో ఇక్కడికి తెచ్చారు. తారును పంపు చేస్తున్న సమయంలో పైపు ఒత్తిడికి పేలిపోయింది. కారిపోతున్న తారును అడ్డుకోవటానికి పడవలోని సిబ్బంది అనేక ప్రయత్నాలు చేశారు. కొన్ని గంటలపాటు లీకేజీ కొనసాగి తారు సముద్రం పాలైంది. చివరికి రిపేర్ చేసి లీక్‌ను అరికట్టారు.
పాలు, చక్కెరలా సంసారం
● జడ్జి హితబోధ
● విడాకులు వద్దని, ఒక్కటైన జంట
మండ్య: జాతీయ లోక్ అదాలత్‌లో దాఖలు చేసిన తమ విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుని ఒక యువ జంట మళ్లీ ఒక్కటయ్యారు. ఏడాది క్రితం, మండ్య జిల్లాలోని కె. ఆర్. పేట తాలూకాలోని ముద్దనహళ్లి గ్రామానికి చెందిన హరీష్, మైసూరుకు చెందిన కవన విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం లోక్ అదాలత్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు వారికి బుద్ధిమాటలు చెప్పారు. ‘జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న బాధలు, సమస్యల గురించి చింతించకుండా, పాలలో చక్కెర కలిసిపోయి రుచిని పెంచినట్లుగా, ఒకరిపై ఒకరు ప్రేమ, నమ్మకంతో జీవించాలి’ అని సీనియర్ జడ్జి సుధీర్ వివరించారు. కనువిప్పు కలిగిన ఆ యువ జంట రాజీపడి తిరిగి ఒక్కటి అవుతామని తెలిపారు. వెంటనే పూలదండలు తెప్పించి మార్పించారు. న్యాయవాదులు హొన్నెనహళ్లి హెచ్. వి. రవి, కామనహళ్లి బోరేగౌడ, వి. కె. స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.


