రాజ కాలువల దుస్థితి మారదా? | - | Sakshi
Sakshi News home page

రాజ కాలువల దుస్థితి మారదా?

Jul 13 2026 4:37 AM | Updated on Jul 13 2026 4:37 AM

సాక్షి, బళ్లారి: స్టీల్‌ సిటీగా పేరుగాంచిన బళ్లారి నగరంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఏళ్ల తరబడి అధ్వానంగా ఉన్న రాజ కాలువల దుస్థితిని పాలకులు పట్టించుకోవడం లేదు. రాజ కాలువల్లో చెత్తా చెదారం, ఇతర వ్యర్థాలు యథేచ్ఛగా పడేయడంతో మురుగు ముందుకు కదలడం లేదు. నగరంలో కణేకల్లు బస్టాండ్‌కు వెళ్లే రహదారి, రూపన గుడి రోడ్డు, గణేష్‌ కాలనీ, విశాల నగర్‌ నుంచి కణేకల్లు బస్టాండ్‌కు వెళ్లే రహదారి, దొణప్ప స్ట్రీట్‌ పక్కనే ఉన్న ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో వెళ్లే రాజ కాలువలు అన్నీ దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారు దోమల బెడద, అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నారు.

అభివృద్ధి శూన్యం..

నగరంలో దాదాపు 50కి పైగా రాజ కాలువలు ఉన్నాయి. రాజ కాలువలతో పాటు ప్రతి కాలనీల్లో ఉన్న డ్రైనేజీలను నిత్యం శుభ్రం చేయించాల్సిన పాలికె అధికారులు, పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. స్థానిక కార్పొరేటర్లు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ కాలువల దుస్థితితో పాటు అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. నగరంలోని చిన్న మార్కెట్‌ అభివృద్ధి చేసేందుకు ఉన్న పాత కట్టడాన్ని కూల్చి వేశారు. ఆ స్థలంలో చిన్న మార్కెట్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. చిన్న మార్కెట్‌ తొలగించడంతో పక్కనే కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుని పలువురు జీవనం సాగిస్తుండగా.. పడగొట్టిన ఖాళీ స్థలం కారు పార్కింగ్‌, చెత్తా చెదారం వేయడానికి ఉపయోగిస్తున్నారు. ఏళ్ల తరబడి అభివృద్ధి పనులు ప్రారంభించక పోవడంతో కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పడగొట్టిన ఖాళీ స్థలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయకపోవడంతో వృథాగా వదిలి వేశారు. బళ్లారి జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు కొరత లేదని చెబుతున్న పాలకులు.. ఆ దిశగా పనులు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మైనింగ్‌ ఫండ్‌, కేఎంఆర్‌సీ తదితర నిధులు వేల కోట్లు మూలుగుతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పనులకు ఖర్చుపెట్టి నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలన్న సంకల్పం, పట్టుదల లేకపోవడంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరగడం లేదని నగర వాసులు పేర్కొంటున్నారు. కనీసం ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి రాజ కాలువ, డ్రైనేజీలను బాగు చేయాల్సిన అవసరం ఉంది.

రాజా కాలువలో ముందుకు కదలని మురుగు

డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు

బళ్లారిలో అస్తవ్యస్తంగా మారిన పారిశుధ్య నిర్వహణ

డ్రైనేజీల్లో చెత్తా చెదారం వేయడంతో దుర్వాసన

రోగాలబారిన పడుతున్న ప్రజలు

పట్టించుకోని పాలకులు, అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement