ఘనంగా మాధ్యారాధన మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మాధ్యారాధన మహోత్సవం

Jul 13 2026 4:37 AM | Updated on Jul 13 2026 4:37 AM

రాయచూరు రూరల్‌: మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠంలో విజయేంద్ర తీర్థుల మాధ్యారాధన మహోత్సవాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి బృందావనానికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం, అలంకారం, అర్చనలు, వేదపారాయణం, మంగళహారతి నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి మూలవిరాట్‌్‌కు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీ పాదంగల్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తుల సమక్షంలో వెండి రథోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బృందావనాన్ని దర్శించుకున్నారు.

ప్రియుడే హంతకుడు

రాయచూరు రూరల్‌: ప్రియురాలు బీదర్‌ జిల్లా బాల్కీ తాలూకా హలగోటలో శనివారం చోటు చేసుకున్న అనిత(32) హత్యోదంతం మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. గ్రామానికి చెందిన అనిత (32)కు రెండేళ్ల కిత్రం వివాహం జరిగింది. రహదారి ప్రమాదంలో భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. అనితకు వైజ్యనాథ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ విషయం అనిత కుటుంబ సభ్యులకు తెలియడంతో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో అనిత్‌.. వైజ్యనాథ్‌ను దూరం పెట్టింది. ప్రియురాలు మాట్లాడటం లేదని మనస్తాపానికి గురైన వైజ్యనాథ్‌.. శనివారం అనిత ఇంటికి వెళ్లాడు. ఆమె స్నానం చేస్తుండగా గొడ్డలితో దాడి చేసి హతమార్చి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఆరోగ్యం బాగుందా?

రాయచూరు రూరల్‌: కలబుర్గి జిల్లా చిత్తాపూర్‌ తాలూకా దండోతి ప్రభుత్వ మైనార్టీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌తో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. చిత్తాపూర్‌ సర్కారీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలబుర్గి జిల్లా అధికారి ఇక్రమ్‌ షరీఫ్‌ ఆదివారం పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అక్కడే ఉన్న వైద్య సిబ్బందిని ఆదేశించారు. హాస్టళ్లలో రుచికరమైన ఆహారం అందించాలని సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందికి సూచించారు.

మాజీ శాసన సభ్యుడు యాసిన్‌ మృతి

రాయచూరు రూరల్‌: రాయచూరు నగర మాజీ శాసన సభ్యుడు సయ్యద్‌ యాసిన్‌ (74) చనిపోయారు. అనారోగ్య కారణాలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం పరిస్థితి విషమించడంతో కన్ను మూశారు. ఈయనకు బార్య, నలుగురు కుమారులు సంతానం. నగరం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1999, 2008లో గెలుపు సాధించారు. మాజీ మంత్రి ఎంఎస్‌ పాటిల్‌, అమరే గౌడ బయ్యాపూర్‌, పాపా రెడ్డి, రాజా అమరేశ్వర నాయక్‌, శాసన సభ్యులు హంపయ్య నాయక్‌, బోసురాజ్‌, శివరాజ్‌ పాటిల్‌, బసన గౌడ, హంపన గౌడ, వసంత్‌ కుమార్‌, సుఖాణి తదితరులు యాసిన్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం రాయచూరులో సయ్యద్‌ యాసిన్‌ అంత్యక్రియ్యలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

చిరుత సంచారంతో బెంబేలు

హొసపేటె: హంపీ ప్రాంతంలో రెండు నెలలుగా చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మనుషులపై దాడి చేస్తున్న చిరుతను వెంటనే బంధించాలని హంపీ గ్రామస్తులు కోరారు. ఆదివారం గైడ్‌ వీరుపాక్షికి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement