హొసపేటె: విద్యా, ఉద్యోగాల్లో దేవదాసి పిల్లలు, మనవళ్లకు రిజర్వేషన్లతో సహా పలు సమస్యలు పరిష్కరించాలని ఫ్రీ దేవదాసి ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఫోరం ఆధ్వర్యంలో దేవదాసి మహిళలు, పిల్లలు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దేవదాసి ఆచారాన్ని నిషేధించనప్పటికీ వివిధ కారణాలతో ఆ సమాజం పద్ధతులు ఆగలేదన్నారు. నిరక్షరాస్యత, నిరుద్యోగం, దైవ, మత భయం, మూఢ నమ్మకాలతో దేవదాసి మహిళలు, వారి పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. దేవదాసి తల్లులు ఫారం–2లో సమర్పించిన దరఖాస్తులను పునఃపరిశీలించి సర్వే, రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం నమోదు చేయాలన్నారు. విద్య, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం, వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా మేజిస్ట్రేజ్ కవితకు అందజేశారు.
లోక్ అదాలతో
ఒక్కటైన 35 జంటలు
హుబ్లీ: వివిధ కారణాలతో విడిపోయిన 35 జంటలు కలహాలకు స్వస్తి పలికాయి. మళ్లీ దాంపత్య జీవితం సాగించేందుకు ఒక్కటయ్యాయి. నగర కుటుంబ కోర్టులో 18 , ప్రధాన కుటుంబ కోర్టులో 7, 1వ అడిషనల్ కుటుంబ కోర్టులో 11 జంటలతో పాటు మొత్తం 35 కేసులు పరిష్కారం అయ్యాయి. వేర్వేరుగా మొత్తం 44 కేసులను పరిష్కరించారు. ధార్వాడ జిల్లా కుటుంబ కోర్టులో రాజీల ద్వారా 55 కేసులను విజయవంతంగా పరిష్కరించారు. ధార్వాడలో 15 మంది దంపతులు తమ కలతలకు స్వస్తి చెప్పి ఒక్కటిగా జీవించడానికి నిర్ణయించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన సెక్షన్ న్యాయమూర్తి విజయ్ మాట్లాడుతూ.. చర్చల ద్వారా దాంపత్య జీవనం కొనసాగిస్తామని అంగీకరించి తమ ఇళ్లకు వెళ్లిన దంపతులను అభినందించారు.
హొసపేటె: విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఐదు జంటలకు లోక్ అదాలత్‌లో కౌన్సెలింగ్ ఇవ్వడంతో మళ్లీ కలసి జీవనం సాగించేందుకు అంగీకరించారు. బొమ్మనహళ్లి తాలూకా న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి మధుసూద ఎన్.డీ.కే అధ్యక్షతన 67 కేసులు పరిష్కరించారు. సివిల్ జూనియర్ జడ్జి సయ్యద్ మొహిద్దీన్ 755 కేసులను గుర్తించి, వాటిలో 66 కేసులను కొట్టి వేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొట్రేష్ షెట్టర్, ఉపాధ్యక్షుడు బీ.ఎం. ఆంజనేయ, సీనియర్ న్యాయవాదులు లింగన గౌడ, సి.హులుగప్ప, ఆంజనేయ హెచ్, వసంతి సలాని, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
బైక్ వీలింగ్‌పై కేసు నమోదు
హుబ్లీ: నగరంలోని హుబ్లీ ధార్వాడ జుబ్లీ సర్కిల్ వద్ద ఓ పోకిరీ ప్రమాదకరంగా బైక్ వీలింగ్ చేసిన ఘటన వెలుగు చూసింది. సుమేర్ సలీం అనే యువకుడు జుబ్లీ సర్కిల్ నుంచి కోర్టు వైపుకు వెళ్లే రోడ్డులో బైక్ వీలింగ్ చేస్తూ స్థానికులకు భయాందోళనకు గురి చేశాడు. ఈ దృశ్యాలను పలువురు రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ధార్వాడ పోలీసులు వీడియో ఆధారంగా యువకుడి ఆచూకీ కనుక్కున్నారు. సుమేర్ సలీంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేఎంసీ డైరెక్టర్‌కు పోటాపోటీ
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో కీలక ఆరోగ్య మహభాగ్యాలను ప్రసాదించే కేఎంసీ ఆస్పత్రి డైరెక్టర్ పదవికి పోటీ నెలకొంది. సుమారు 17 మంది సీనియర్ వైద్యులు ఈ పదవి దక్కించుకునేందుకు బరిలో నిలిచారు. ఈసారి ఎలాగైనా పదవి తమకే ఇవ్వాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. డాక్టర్.ఎస్‌ఎఫ్ కమ్మరా, అరుణ్ కుమార్ చవాన్, సూర్యకాంత, తదితర పేర్లు తెరమీద జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నెలలో ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉందని తెలిసింది.


