రాయచూరు రూరల్: హిడకల్ జలాశయం నుంచి వచ్చే ఘటప్రభ కుడి కాలువ మరమ్మతులకు అధికారులు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా కాలువలో పూడిక, కంప చెట్లు పెరిగిపోయాయి. రాయబాగ తాలుకా కబ్బూర, మంటూరు, నిపనాళ, ఖడక బావి, చిక్కోడి తాలుకాలోని జాగనూరు, గోకాక్ తాలుకాలోని దండాపూర్, మమదాపూర్ ప్రాంతాల్లో 10 వేల హెక్టార్లకు నీరు అందడం లేదు. నరేగా పనుల్లో భాగంగా కాలువల్లో పూడిక తీయాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే పీడీఓలు స్పందించక పోవడంతో చివరకు రైతులే కాలువల్లో పేరుకుపోయిన పూడిక, ముళ్ల కంప చెట్ల తొలగింపు పనులకు శ్రీకారం చుట్టారు. 35 కి.మీ మేర పొడవు ఉన్న కాలువలో పేరుకుపోయిన పూడిక, ముళ్ల కంప చెట్లను 11 రోజుల పాటు 50 మంది రైతులు రెండు విభాగాలుగా విడిపోయి తొలగించారు. రైతులు చేయి చేయి కలపి దెబ్బతిన్న కాలువకు మరమ్మతులు చేపట్టారు. ఇదిలా ఉండగా కాలువల మరమ్మతులకు రూ.కోటి నిధులతో ప్రతిపాదన సర్కార్ వద్ద పెండింగ్‌లో ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు. సాగునీటి కోసం రైతులే కాలువ శుభ్రతకు శ్రీకారం చుట్టడంతో స్థానికులు అభినందిస్తున్నారు.


