బళ్లారి అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హుల ఓట్ల తొలగించకుండా చూస్తామని కేపీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్.సుదర్శన్ స్పష్టం చేశారు. ఆదివారం బళ్లారిలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బళ్లారి, విజయనగర జిల్లాలకు సంబంధించిన రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు రాయల్టీ బకాయిలను కోర్టు ద్వారా సాధించి జిల్లాల అభివృద్ధికి వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు కాంగ్రెస్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్‌ఓల ద్వారా జరుగుతున్న సర్ ప్రక్రియకు కాంగ్రెస్ సహకరిస్తోందన్నారు. ఈ అంశంపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకొస్తామని తెలిపారు. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. సమావేశంలో అల్లం ప్రశాంత్, ముండిరిగి నాగరాజ్, మేయర్ గాదెప్ప, హుమాయూన్ ఖాన్, రాజేశ్వరి సుబ్బరాయుడు, ఎల్.మారన్న, వెంకటేష్ హెగ్డే, శ్రీనివాస్, కానేకల్ మబూసాబ్, బోయపట్టి విష్ణువర్దన్, బీఎం పాటిల్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


