యశవంతపుర: చిక్కమగళూరు తాలూకా కవికల్ మఠానికి సమీపంలో సూర్యాస్తమయాన్ని వీక్షించడాని వెళ్లిన టూరిస్టులకు పెద్ద పులి కనిపించడంతో గజగజ వణికిపోయారు. అయితే పర్యాటకులను చూసిన పెద్దపులి రోడ్డు మధ్యలో కొంతసేపు కూర్చొని వెళ్లిపోవడంతో హమ్మయ్య అనుకున్నారు. ప్రయాణికులు వాహనంలోంచి దిగకుండానే మొబైల్‌ఫోన్లలో పెద్ద పులిని వీడియోలు తీసుకున్నారు. పులి అంత దగ్గరగా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ముత్తోడి ప్రాంతం వద్ద అడవిలో పెద్ద పులి తిరుగుతోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి నుంచి భద్రత కల్పించాలని గ్రామస్థులు మనవి చేశారు.
ఇద్దరు ఇళ్ల
యజమానుల అరెస్టు
దొడ్డబళ్లాపురం: విదేశీయులకు ఇల్లు బాడుగకు ఇచ్చే ముందు, లేదా ఇచ్చాక నగర పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిబంధన ఉంది. దీనివల్ల అద్దెకు దిగినవారిని పోలీసులు తనిఖీ చేస్తారు. కానీ అలా సమాచారం ఇవ్వని ఇద్దరు ఇళ్ల యజమానులను మాదనాయకనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు ఉత్తర తాలూకా బైలకోనేనహళ్లికి చెందిన సునీల్ (45), కుదురెగెరె జయరాం (42) అరైస్టెన వారు. వీరు ఇద్దరూ విదేశీయులకు ఇళ్లు బాడుగకు ఇచ్చారు, ఆ వివరాలను స్థానిక పోలీసులకు ఇవ్వలేదు. ఈ కారణంతో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
కొల్లూరు మూకాంబిక మాత సేవలో కేరళ సీఎం
యశవంతపుర: కేరళ ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ శనివారం ఉడుపి జిల్లాలో ప్రఖ్యాత కొల్లూరు ముకాంబిక దేవస్థానాన్ని దర్శించుకుని పూజలు చేశారు. ఉదయమే ఆలయానికి వచ్చిన ఆయనకు లాంఛనాలతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. కొద్దిసేవు ఆయన దేవస్థానంలో గడిపారు. గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. తరువాత మంగళూరుకు వెళ్లి బెంగళూరుకు ప్రయాణమయ్యారు. ముకాంబికా దేవి భక్తుడైన సతీశన్‌కు ప్రత్యేక తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇటీవల తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, అనంత అంబానీ లాంటి ముఖ్యులు ముకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇంట్లోకి దూరి హత్య
దొడ్డబళ్లాపురం: బీదర్ జిల్లా బాల్కి తాలూకా హాలగూట గ్రామంలో మహిళను ఇంట్లోకి చొరబడి హత్య చేశారు. అనిత (32) హతురాలు. అనిత స్నానం చేస్తుండగా వచ్చిన వ్యక్తి కొడవలితో నరికి హత్య చేసి పరారయ్యాడని గ్రామస్తులు తెలిపారు. నిందితుడు కై లాశ్ వైజనాథ్ అని కొందరు చెబుతున్నారు.ఆ వ్యక్తికి, అనితకు ఉన్న సంబంధం ఏమిటి, ఎందుకు హత్య చేశాడనేది తెలియాల్సి ఉంది. కటక చించోళి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


