హెచ్‌ఎంటీ భూమిలో భారీ పార్క్‌: మంత్రి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎంటీ భూమిలో భారీ పార్క్‌: మంత్రి

Jul 12 2026 1:41 AM | Updated on Jul 12 2026 1:41 AM

శివాజీనగర: హెచ్‌ఎమ్‌టీ భూమి అటవీ భూమిగానే ఉంటుందని గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రె చెప్పారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉందని, హెచ్‌ఎమ్‌టీకి కాదని అన్నారు. శనివారం వికాససౌధలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. అయితే హెచ్‌ఎంటీ అటవీ భూమిని స్వాధీనం చేసుకుని లాల్‌బాగ్‌, కబ్బన్‌పార్కుల కంటే అక్కడ అతి పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించి ఉత్తర బెంగళూరు నివాసులకు ఊపిరిని కల్పిస్తామని చెప్పారు. హెచ్‌ఎంటీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం తమదని చెప్పడంపై కుమారస్వామి వ్యతిరేకించడం తెలిసిందే. హెచ్‌ఎమ్‌టీ భూమిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని న్యాయమూర్తి తీర్పు ఇవ్వాలి కాని కుమారస్వామి కాదు అన్నారు. అటవీ భూమిగా ప్రకటించిన భూమిని చట్టబద్దంగా మరో ప్రయోజనానికి మార్చకపోతే, అది అటవీ భూమిగానే మిగిలిపోతుందని తెలిపారు.

రైతన్న ఆత్మహత్య

మండ్య: మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని కనగణమరడి గ్రామంలో రైతన్న కె. ఎన్‌. హరీష్‌ (47) ఆత్మహత్య చేసుకున్నాడు. హరీష్‌ వ్యవసాయం కోసం బ్యాంకుల నుంచి, పరిచయస్తుల నుంచి రూ. 7 లక్షల వరకూ అప్పులు చేశాడు. తిరిగి చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారని తండ్రికి చెప్పాడు. కరువు వల్ల చెరకు పంట ఎండిపోయి నష్టాలు వచ్చాయని విరక్తి చెంది పొలంలోనే టేకు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు తండ్రి నాగరాజు పాండవపుర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అక్టోబర్‌, లేదా నవంబర్‌లో

పంచాయతీ ఎన్నికలు

మంత్రి ఈశ్వర్‌ ఖండ్రె

శివాజీనగర: రాష్ట్రంలోని చాలా గ్రామ, తాలూకా పంచాయతీల పదవీకాలం ముగిసిందని, అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె తెలిపారు. శనివారం వికాససౌధలో మాట్లాడుతూ కొన్ని పంచాయితీల అప్‌గ్రేడ్‌లు, పునర్విభజన చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇది నెలాఖారులోగా పూర్తవుతుంది. రిజర్వేషన్లను నిర్ణయించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పిస్తాం. ఎన్నికల సంఘం 45 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహిస్తుంది అని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం అవుతున్నాయని ప్రస్తావించగా, సర్‌ ప్రక్రియ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ బిజీగా ఉన్నారని, అందుకే సమయం కోరామని ఆయన తెలిపారు.

ఈ–ప్రాపర్టీ సరళతరం చేస్తాం

గ్రామీణ ప్రాంతాల్లో ఈ–ప్రాపర్టీ వ్యవహారంలో ఫిర్యాదులు వస్తున్నాయని, సర్‌ తరువాత ఈ వ్యవస్థను మరింత సరళీకృతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తి యజమానులందరికీ ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. వారి ఇంటి వద్దకే ఈ–ప్రాపర్టీ పత్రాలను అందిస్తామన్నారు. ఒకవేళ బీ–ఖరాబు భూమిలో లేఔట్‌ను నిర్మించి ఉంటే, అక్కడ ఈ–ప్రాపర్టీని ఇవ్వబోరన్నారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కర్ణాటక గ్రామ పంచాయితీలకు ఇవ్వాల్సిన రూ.2,186 కోట్లను విడుదల చేయలేదని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement