రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకాలో జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం సంచాలకుడు హనుమంతు డిమాండ్ చేశారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవదుర్గ తాలూకా మరి బూదూరులో గత నెల 2వ తేదీన మహ్మద్ సాబ్ అనే వ్యక్తిని ఇనుపరాడ్‌తో కొట్టి చంపారన్నారు. కట్టెలు వేసుకోనే స్థలం విషయంలో సిద్దనగౌడ, భార్య ఉమాదేవి కొట్లాడి మహ్మద్ సాబ్‌ను హత్య చేశారన్నారు. నెల రోజులకు పైగా గడిచినా నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైందన్నారు. వారం రోజుల్లో నిందితులను అరెస్ట్ చేయాలని ఒత్తిడి చేశారు. ఉమాదేవి అక్క భర్త గోవింద రెడ్డి గ్రామంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ చంపుతానని బెదిరిస్తున్నారన్నారు.
సంతానం కాలేదన్న బాధతో మహిళ ఆత్మహత్య
హుబ్లీ: బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా మమదాపుర కేకే గ్రామ వివాహిత రుక్మిణి మూడలిగి (24) తనకు సంతానం కలగలేదన్న బాధతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నిప్పాణి తాలూకా భోజ గ్రామానికి చెందిన బసవరాజ్ ఉప్పార్‌తో ఆమెకు నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. అప్పటి నుంచి తనకు సంతానం కలగలేదని తరుచు ఆమె బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిసింది.
సమగ్ర ఓటరు సవరణ చేపట్టండి
రాయచూరు రూరల్: ప్రత్యే సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్)కు చర్యలు చేపట్టాలని నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో పేర్కొన్నారు. శనివారం నగరంలోని 8, 9, 10వ వార్డులలో పర్యటించి బీఎల్‌ఓలు, ఇతర కార్యకర్తలతో చర్చించి సమీక్ష పనులు వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో 1 లక్ష మంది ఓటర్ల పేర్ల సమీక్ష పెండింగ్‌లో ఉందని, దానిని త్వరిత గతిన పూర్తి చేయాలని, లేకుంటే సదరు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసు కుంటామన్నారు.
కష్టపడి చదివితే
లక్ష్య సాధన సులభం
హొసపేటె: నేటి పోటీ యుగంలో విద్యారంగంలో విద్యార్థులు కష్టపడి తమ లక్ష్యాలను సాధించాలని మాజీ ఎమ్మెల్యే హాలప్ప అన్నారు. విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి పట్టణంలోని కళ్యాణ మండపంలో చాణక్య కెరీర్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన పోలీస్ పోటీ పరీక్షల కోసం 15 రోజుల ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ఉచిత శిక్షణ సౌకర్యాన్ని ఉపయోగించుకుని వందలాది మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందితే అకాడమీ కృషి సాకారమవుతుందని ఆయన అన్నారు. అకాడమీ డైరెక్టర్ ప్రదీప్, ఎమ్మెల్యే కే.నేమిరాజ్ నాయక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సగం జరిమానాతో నో హెల్మెట్ కేసుకు స్వస్తి
హుబ్లీ: హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి రూ.36,500 జరిమానా చెల్లించాల్సిన బుల్లెట్ యజమాని ఆర్‌టీఓ ప్రకటించిన సగం జరిమానా రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకొని రూ.18 వేలను ట్రాఫిక్ పోలీసులకు చెల్లించారు. రూ.36 వేలకు పైగా జరిమానా చెల్లించాల్సి ఉన్నా ఆయన చెల్లించక అలానే పెండింగ్‌లో ఉంచుకున్నారు. రవాణా శాఖ 50 శాతం జరిమానా రాయితీ అవకాశం ఇవ్వడంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చి రూ.18 వేలు జరిమానా చెల్లించారు. తాను హెల్మెట్ ధరించకుండా బుల్లెట్‌పై సంచరించినందుకు ఇంత భారీ మొత్తం జరిమానా చెల్లించాల్సి వచ్చిందని, ఇకపై ఎట్టి పరిస్థితిలోను హెల్మెట్ లేకుండా వాహనం ఎక్కబోనని, అందరూ కూడా తనలాగే భారీ జరిమానాకు బాధితులు కాకుండా ట్రాఫిక్ నియమాలను పాటించాలని బుల్లెట్ యజమాని సూచించినట్లు పోలీసులు తెలిపారు.


