గాన కోకిల.. సెలవిక | - | Sakshi
Sakshi News home page

గాన కోకిల.. సెలవిక

Jul 12 2026 1:41 AM | Updated on Jul 12 2026 1:41 AM

మైసూరు: ప్రఖ్యాత గాయనీమణి, సుమధుర కంఠంలో కోట్లాది మంది శ్రోతల్ని, సినీ అభిమానుల్ని సంగీత సాగరంలో ఓలలాడించిన ఎస్‌.జానకి శనివారం రాత్రి మైసూరులోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మరణంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. జానకి (88) గత కొన్నేళ్లుగా మైసూరులో నివాసం ఉంటున్నారు. తెలుగువారైన జానకికి కన్నడ చిత్రరంగంలో ప్రగాఢ అనుబంధం ఉంది. కన్నడలోని అనేక సూపర్‌ హిట్‌ పాటలలో వీణ వాయించింది కూడా ఎస్‌.జానకియే. ముఖ్యంగా, పి.బి. శ్రీనివాస్‌, ఎస్‌.బి.బాలసుబ్రహ్మణ్యం, కంఠీరవ డాక్టర్‌ రాజ్‌కుమార్‌లతో కలిసి ఆమె పాడిన యుగళగీతాలు కన్నడిగులను మైమరిపించాయి. జానకి తన మొదటి కన్నడ పాటను 1957లో పాడారు. ఆ తర్వాత కన్నడలో నంబర్‌ 1 గాయనిగా ఎదిగారు. సంగీత దర్శకులు జి.కె. వెంకటేష్‌, రాజన్‌–నాగేంద్ర నుంచి హంసలేఖ వరకు, జానకి పాట కోసం తపించేవారు. 2014లో జానకిని రాష్ట్ర ప్రభుత్వం రాజ్యోత్సవం పురస్కారంతో గౌరవించుకుంది. ఆమె సేవలకుగాను మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. భారతీయ భాషలే కాదు జపనీస్‌, జర్మన్‌, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, సింహళ భాషలలో ఆమె పాటలు పాడారు.

నేడు అంత్యక్రియలు

జానకి మరణానికి సీఎం డీకే శివకుమార్‌తో సహా మంత్రులు, సినీ రంగ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. తన యవ్వన దశలో మైసూరులో కొంతకాలం నివసించిన జానకికి మైసూరు అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె తన జీవిత చరమాంకాన్ని మైసూరులోనే గడిపారు. అంత్యక్రియలు సైతం మైసూరులోనే జరగాలని ఆమె కోరుకున్నారు. ఆదివారం ఉదయం 7.30 నుంచి మైసూరు నగర నడిబొడ్డున ఉన్న మహారాజా మైదాన్‌లో ఎస్‌. జానకి పార్థివ దేహాన్ని ప్రజల తుది దర్శనం కోసం ఉంచుతారు. జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం, మైసూరులోని బోగాది సమీపంలో ఉన్న కనియార్‌ హుండీ గ్రామ ఉద్యానవనంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని జానకి దత్తపుత్రులు పవన్‌, అనిల్‌ ప్రకటించారు. మంత్రి యతీంద్ర సిద్దరామయ్య ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

ప్రఖ్యాత గాయని

ఎస్‌.జానకి మైసూరులో అస్తమయం

కన్నడ చిత్రరంగంతో ప్రత్యేక అనుబంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement