రాయచూరు రూరల్: చదువుపై దృష్టి పెట్టేలా నేటి విద్యార్థులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని స్వామి వివేకానంద ఆశ్రమ సంచాలకుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. ఆదిఽవారం నగరంలోని ప్రైవేట్ భవనంలో రోటరీ ఫౌండేషన్, క్లబ్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లల భవిష్యత్తును అంధకారంలో పడేయకుండా వారికి బంగారు బాటలు వేయాలన్నారు. నేడు విద్యకు ఉన్న ప్రాధాన్యత ఏ రంగానికీ లేదన్నారు. మహిళలు స్వశక్తితో తమ కాళ్లపై తాము నిలబడి జీవించడానికి రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పేర్కొన్నారు. కార్యక్రమంలో లక్ష్మీదకాంతరెడ్డి, త్రివిక్రం జోషి, చంద్రకాంత్, నిజానందరెడ్డి, కేశవరావు్, రవీంద్ర, కృష్ణ, అశోక్ కుమార్, పవన్, మునిస్వామి, శివశంకర్‌లున్నారు.
పథకాలు లబ్ధిదారుల దరి చేర్చండి
రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను లబ్ధిదారులకు అందించాలని కేంద్ర ప్రభుత్వ మహత్వాకాంక్ష శాఖ సంయుక్త కార్యదర్శి ఉజ్వల్ కుమార్ ఘోష్ సూచించారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, మహిళా శిశు సంక్షేమ శాఖ, మౌలిక సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రధానమంత్రి మహత్వాకాంక్ష పథకం దేశ వ్యాప్తంగా 122 జిల్లాల్లో అమలులో ఉండగా, రాయచూరు జిల్లా 49వ స్థానంలో ఉందన్నారు. కనీసం 250 గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లాధికారిణి పూవిత, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, అిసిస్టెంట్ కమిషనర్ హంపణ్ణ సజ్జన్, జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జున, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, రోణ, తిమ్మప్ప, సోమశేఖరప్ప, శరణమ్మ, నందిత, వీరేష్ నాయక్‌లున్నారు.
గవియప్పకు మంత్రిగిరీ కోసం హంపీలో ప్రత్యేక పూజలు
హొసపేటె: విజయనగర అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే హెచ్‌ఆర్.గవియప్పకు మంత్రి పదవి లభించాలని కోరుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం హంపీలోని విరుపాక్షేశ్వర స్వామి ఆలయంలో పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కును తీర్చాలని 201 కొబ్బరికాయలు కొట్టారు. కాంగ్రెస్ నాయకుడు సోమేష్ మాట్లాడుతూ కొత్త జిల్లా అభివృద్ధి దృష్ట్యా తప్పనిసరని, ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్పకు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు రామన్న, మహేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుక్కలకు రేబిస్ టీకాలు
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా హంపాపట్టణ గ్రామ పంచాయతీ, తాలూకా పశుసంవర్థక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో పెంపుడు, వీధి కుక్కలకు రేబిస్ టీకాలు వేశారు. ప్రభుత్వ పశువైద్యశాల సమీపంలో నిర్వహించిన టీకాల పంపిణీ కార్యక్రమంలో గ్రామంలోని 30కి పైగా పెంపుడు కుక్కలకు రేబిస్ టీకాలను వేయడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టారు. ఇటీవల గ్రామంలో పిచ్చికుక్క దాడిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈనేపథ్యంలో రేబిస్ వ్యాప్తిని నివారించడానికి సోమవారం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పత్రీ యల్లప్ప ప్రారంభించారు. పంచాయతీ అభివృద్ధి అధికారి ఖాజా బన్నీ మాట్లాడుతూ రేబీస్ ఒక ప్రాణాంతక వ్యాధి అని, దాని వ్యాప్తిని నివారించడానికి మనమందరం కలిసి పని చేయాలని అన్నారు. ప్రతి కుక్కకు రేబిస్ టీకా వేయించాలి. టీకా కార్యక్రమాన్ని తప్పనిసరి చేస్తే, గ్రామంలో రేబిస్ వ్యాధి సోకిన కుక్కలు ఉండవు. ప్రజారోగ్యం దృష్ట్యా, ప్రతి ఒక్కరూ తమ కుక్కలను రేబిస్ టీకాలు వేయించాలని విజ్ఞప్తి చేశారు.


