సాక్షి,బళ్లారి: మూడు రోజుల క్రితం తాళూరు రోడ్డులో నగర శివార్లలోని గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఓ విద్యార్థి ఉన్మాదిగా మారి తన సహచర విద్యార్థులపై చాకు, రాడ్‌తో దాడి చేసి గాయపరిచి ఒకరిని చంపడంతో పాటు 8 మందిని తీవ్రంగా గాయపరిచిన ఘటన మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని సంజయ్‌గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చదువుతున్న గుగ్గరహట్టికి చెందిన అరవింద్(17) అనే విద్యార్థి కళాశాలలో జరిగిన రగడపై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇటీవల కళాశాలలో కొంత మంది విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. అందుకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి యాజమాన్యం మందలించింది. ఈ రగడలో అరవింద్ కూడా ఉండటంతో వారి తల్లిదండ్రులను కూడా పిలిపించి, మందలించడంతో పాటు ఇలాంటి వారిని తాము తమ కళాశాలలో చదివించలేమని, ఇంటికి పంపిస్తామని ఘాటుగా హెచ్చరించడంతో మనస్తాపంతో అరవింద్ మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడి ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన
సమాచారం అందుకున్న స్థానిక బ్రూస్‌పేట పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక బిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తమ స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుని కళాశాల వద్ద స్నేహితులు, బంధువులు ఆందోళన చేశారు. పెద్ద సంఖ్యలో గుమిగూడి కళాశాలలోకి చొరబడి అద్దాలు పగులగొట్టి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి మృతికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి సోదరుడు గణేష్ మాట్లాడుతూ కళాశాలలో గొడవ జరిగిన తర్వాత తమ తల్లిదండ్రులను పిలిపించి తాము వచ్చే ఏడాది అడ్మిషన్ ఇవ్వమని, ఇంటికి పంపిస్తామని హెచ్చరించారన్నారు. ప్రిన్సిపాల్ కాళ్లు పట్టుకున్నా కనికరించ లేదని, ప్రిన్సిపాల్ మానవతా విలువలు మరిచి నడుచుకున్నారని, దీంతో ఆవేదన చెందిన తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై బ్రూస్‌పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి బలవన్మరణం
కళాశాలలో జరిగిన ఘర్షణపై మందలింపు
మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకున్న అరవింద్
బళ్లారిలో కలకలం రేపిన మరో విషాదం


