హుబ్లీ: కర్ణాటక పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వని కారణంగా బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ అధ్యక్షుడు లింగరాజ పాటిల్ రాజీనామా సమర్పించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ గత 37 ఏళ్ల నుంచి పార్టీకి చిత్తశుద్ధితో కార్యకర్తగా పని చేశాను. పార్టీ అప్పగించిన ఎన్నో పనులను సమర్థవంతంగా నిర్వర్తించాను. అయినా తనకు టికెట్ ఇవ్వక పోవడంతో చాలా బాధ కలిగిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కాగా ఎస్‌వీ సంకనూరుకు ఆ పార్టీ టికెట్ కేటాయించింది. ఆయన్ను మార్చి ఆ టికెట్ తనకు ఇవ్వడానికి ఇంకా సమయం ఉందన్నారు. 8 రోజుల్లో పార్టీ పెద్దలు ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని లేఉకంటే తన తదుపరి నిర్ణయాలను వెల్లడిస్తానన్నారు. పార్టీలో నిష్టావంతులైన కార్యకర్తలకు విలువ లేదన్నారు. అందుకే రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి చెందడం లేదన్నారు. హుబ్లీ– ధార్వాడల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగరాదన్న ఉద్దేశంతోనే తనకు రావాల్సిన టికెట్‌ను చాడీలు చెప్పి తప్పించారని ఆరోపించారు. గత ఎన్నికల వేళ సంకనూరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించినా కూడా ఈ సారి పార్టీ ఆయనకే టికెట్ కేటాయించడంతో కార్యకర్తలకు ఎంతో ఆవేదనను కలిగించిందన్నారు. పార్టీ తనకు చేసిన ద్రోహం సమస్త కార్యకర్తలకు చేసిన అన్యాయం అన్నారు. పార్టీ నాకు తల్లిలాంటిది, పార్టీని వీడను అయితే తన వైఖరి మాత్రం మారుతుందని తెగేసి చెప్పారు.
బీజేపీకి లింగరాజ పాటిల్ రాజీనామా


