హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి వద్ద వేగంగా వెళుతున్న ఆర్‌టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో డ్రైవర్, కండక్టర్‌తో సహా అనేక మంది ప్రయాణికులు తీవ్ర గాయపడిన ఘటన మంగళవారం జరిగింది. కూడ్లిగి డిపోకు చెందిన బస్సు ఉదయం తాలూకాలోని కాసాపుర నుంచి తిరిగి వస్తుండగా పట్టణంలోని గుడేకోటె రోడ్డులోని సాగర్ డబ్బా సమీపంలో బైక్‌ను తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ అదుపు తప్పిన బస్సు రోడ్డుకు కుడి వైపున ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం కుడి వైపు పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా డ్రైవర్ శశిధర్‌కు కుడి కాలు విరిగింది. కండక్టర్ పాటిల్‌కు ముఖంపై, ప్రయాణికులకు శరీరంపై గాయాలయ్యాయి. బస్సులో విద్యార్థులతో సహా 62 మంది ఉన్నారు. వారిలో కొంత మందికి తీవ్ర గాయాలు కాగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కూడ్లిగి పోలీస్ స్టేషన్ సీఐ ప్రహ్లాద్ చెన్నగిరి, ఎస్‌ఐ ప్రకాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఎస్పీ జాహ్నవి ఆస్పత్రిలో చికిత్స పొందిన క్షతగాత్రులను పరామర్శించారు.


