సాక్షి,బళ్లారి: రైతుల నుంచి బలవంతంగా విమానాశ్రయ నిర్మాణం కోసం స్వాధీనం చేసుకున్న 900 ఎకరాల భూమిలో ఎందుకు విమానాశ్రయం నిర్మించడం లేదని, ఒకవేళ విమానాశ్రయం నిర్మించకపోతే రైతులకు తిరిగి భూమి వాపసు ఇవ్వాలని విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం విధాన పరిషత్‌లో ఈ సమస్యపై గళం విప్పి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. బళ్లారి సమీపంలోని సిరివార గ్రామ శివార్లలో 2009లో 900 ఎకరాల భూములను విమానాశ్రయం కోసం స్వాధీనం చేసుకున్నారన్నారు. అప్పటి నుంచి నిర్మాణం చేపట్టడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.
భూములు తిరిగివ్వడం అసాధ్యం–మంత్రి
దీనిపై మంత్రి ఎం.బీ.పాటిల్ స్పందిస్తూ బళ్లారి, విజయనగర, కొప్పళ జిల్లాల్లో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. త్వరలో మూడు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. బళ్లారిలో విమానాశ్రయం కచ్చితంగా నిర్మిస్తామన్నారు. రైతులకు భూమి తిరిగి ఇవ్వడం సాధ్యం కాదన్నారు. కుడితిని సమీపంలో ఆర్సెలర్ మిత్తల్ పరిశ్రమ కోసం స్వాధీనం చేసుకున్న భూమిని ప్రాజెక్టు నిర్మాణం చేయని పక్షంలో రైతులకు ఆ భూములను తిరిగి ఇవ్వాలని కూడా ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు.
లేకుంటే రైతులకు భూమి వాపసు ఇవ్వండి
పరిషత్‌లో ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్ డిమాండ్


