హొసపేటె: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు మొదటి దశ జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని, అధికారులు ఖచ్చితమైన, స్పష్టమైన సమాచారాన్ని సేకరించాలని ఏడీసీ ఈ.బాలకృష్ణ ఆదేశించారు. భారత జనాభా లెక్కల సేకరణ–2027లో భాగంగా జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత సిబ్బందికి సోమవారం జిల్లాధికారి కార్యాలయ ఆడిటోరియంలో 3 రోజుల శిక్షణ సదస్సును ప్రారంభించి ఆయన మాట్లాడారు. జనాభా గణన మొదట 1872లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు మొత్తం 15 జనాభా గణనలు జరిగాయి. దేశానికి స్వాతంత్య్రం తర్వాత 8 జనాభా గణనలు జరిగాయి. మునుపటి జనాభా గణన 2011లో జరిగింది. ఆ ప్రకారం 2021లో జరగాల్సిన జనాభా గణన కరోనా తదితర కారణాలతో వాయిదా పడింది. మొదటి సారిగా జనాభా లెక్కలను దేశ వ్యాప్తంగా మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ మోడ్‌లో నిర్వహించనున్నారు. అందువల్ల అధికారులు జిల్లాలోని పట్టణ, తాలూకా, గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితమైన, సృష్టమైన డేటాను సేకరించాలని ఆయన సూచించారు. జనాభా లెక్కల సేకరణ కోసం గణకదారులు, పర్యవేక్షకులను నియమించారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 6 మంది, పట్టణ ప్రాంతాల్లో 8 మంది జనాభా లెక్కల సేకరణలో పాల్గొంటారన్నారు. లెక్కింపు సమయంలో ఏదైనా గందరగోళం ఉంటే వారు పర్యవేక్షకులు లేదా ఉన్నతాధికారులను సంప్రదించాలని ఆయన అన్నారు. తహసీల్దార్ శృతి, సీడీపీఓ అన్నదానయ్య, మున్సిపల్ కౌన్సిలర్ శివకుమార్ ఎర్రగుడి, వర్క్‌షాప్ ప్రజెంటర్లు మాథ్యూ, శ్రీకాంత్ పాల్గొన్నారు.


