హాస్టళ్లపై పర్యవేక్షణ ఏదీ? | - | Sakshi
Sakshi News home page

హాస్టళ్లపై పర్యవేక్షణ ఏదీ?

Mar 10 2026 12:53 PM | Updated on Mar 10 2026 12:53 PM

సాక్షి,బళ్లారి: నగరంలోని పలు విద్యా సంస్థలు పేరుకు మాత్రమే గొప్పగా బోర్డులు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను మాయలో పడేస్తున్నాయి. వారి పిల్లలను తమ స్కూళ్లు, కాలేజీల్లో చేర్పించుకుని రూ.లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ కనీస నిర్వహణ చేపట్టకపోవడంతో విద్యార్థులు ఆడిందే ఆట..పాడిందే పాటగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. నగరంలో పలు స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారన్న బహిరంగ విమర్శలు వస్తున్నాయి. దీనిపై పలు విద్యార్థి సంఘాలు గతంలో ఆందోళనలు కూడా చేశాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దులో ఉన్న బళ్లారి నగరం ప్రధానంగా వ్యాపార, విద్యా కేంద్రాలకు నిలయంగా ఉంది. దీంతో ఇక్కడకు పొరుగున ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు తమ పిల్లలను బళ్లారిలో చదివించడం పరిపాటిగా మారింది. ఫీజుల విషయం పరిశీలిస్తే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, ఇక్కడికి రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నా విద్యార్థులు ఎలా చదువుతున్నారు? వారి బాగోగుల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

గంజాయి ఆరోపణలు గుప్పు

రెండు రోజుల క్రితం నగర శివార్లలోని గురుకుల ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో జరిగిన ఘటన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కలకలం రేపింది. 9వ తరగతి విద్యార్థి ఉన్మాదిగా మారి, తోటి విద్యార్థి హేమంత్‌(14)ను దారుణంగా హత్య చేయడంతో పాటు అడ్డొచ్చిన 7 మంది విద్యార్థులను తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. హాస్టల్‌లో ఏ విద్యార్థి ఎలా ఉన్నాడన్న కనీస పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. స్కూల్‌ హాస్టల్‌లో కేవలం 9 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారి కదలికలను కూడా పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడి చేసిన బాలుని ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. హత్య దురంతంతో నగరంలో ఇతర హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. విద్యా శాఖ అధిఽకారుల తనిఖీలు కూడా కరువై హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా మారినట్లు తెలుస్తోంది.

హాస్టల్‌లో దాడి ఘటనపై చర్యలకు డిమాండ్‌

బళ్లారిఅర్బన్‌: తాళూరు రోడ్డులోని గురుకుల ఇంటర్నేషనల్‌ పాఠశాల హాస్టల్‌లో జరిగిన దాడి నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) డిమాండ్‌ చేసింది. సోమవారం సరళా దేవి కళాశాల నుంచి రాయల్‌ సర్కిల్‌ మీదుగా జిల్లాధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. గత కొన్ని నెలలుగా జిల్లాలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. యువత డ్రగ్స్‌, గంజాయి వినియోగానికి పాల్పడుతుండటం ఆందోళనకరమని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. హాస్టల్‌లో వార్డెన్‌, తగిన భద్రత సిబ్బంది లేకపోవడం పెద్ద నిర్లక్ష్యం అని, విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా హాస్టల్‌ నిర్వహించిన పాఠశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది.

యాజమాన్యాల నిర్లక్ష్యం,

అధికారుల అలసత్వం

ప్రైవేట్‌ స్కూళ్ల విద్యార్థుల

ప్రాణాలకే ప్రమాదం

కలకలం రేపిన గురుకుల

పాఠశాలలో దాడి ఘటన

దాడి కేసులో నిందితుడు అరెస్టు

సాక్షి,బళ్లారి: నగరంలోని గురుకుల పాఠశాల హాస్టల్‌లో పలువురు విద్యార్థులపై దాడి చేసి గాయపరిచి పరారైన నిందితుడిని పోలీసులు సోమవారం నగరంలోని రూపనగుడి రోడ్డులో గంగప్ప జిన్‌ సర్కిల్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. తన కార్యాలయంలో ఎస్పీ డాక్టర్‌ సుమన్‌ డి.పన్నేకర్‌ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఈనెల 7న నగరంలోని ఓ ప్రైవేట్‌ విద్యాసంస్థ హాస్టల్‌లో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న బాలుడిని పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. ఘటన జరిగిన పాఠశాల యాజమాన్యానికి స్కూల్‌, హాస్టల్‌ నిర్వహణ సంబంధిత చట్టబద్ధ అనుమతి పత్రాలను సమర్పించాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓకు కూడా ఆ పాఠశాల చట్టబద్ధ అనుమతులతో నడుస్తోందా? లేదా? పరిశీలించాలని అధికారికంగా లేఖ రాసినట్లు ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement