ట్రాక్టర్‌ బోల్తా.. బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా.. బాలుడు మృతి

Mar 10 2026 12:53 PM | Updated on Mar 10 2026 12:53 PM

సాక్షి,బళ్లారి: ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బీదర్‌ జిల్లా భాల్కి తాలూకా పరిధిలోని మడకట్టి క్రాస్‌ సమీపంలో ట్రాక్టర్‌ బోల్తా పడగా, అందులో వెళుతున్న శోహమ్‌(13) అనే బాలుడు కింద పడి మరణించాడు. బాలుడి మృతితో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం తెలియగానే చించోళి పోలీసులు హుటాహుటిన చేరుకుని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

గ్యాస్‌ ధరల పెంపుపై నిరసన

రాయచూరు రూరల్‌: కేంద్రం ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించాలని మహిళా కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. సోమవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ఆందోళనలో జాతీయ కార్యదర్శి శ్రీదేవి నాయక్‌ మాట్లాడారు. గృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.60, వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.115 చొప్పున పెంచడాన్ని ఖండించారు. గతంలో గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచిన ప్రభుత్వం మరోసారి పెంచి పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల నడ్డివిరిచారని ఆరోపించారు. పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ ప్రధానికి పంపదలచిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ సురేష్‌వర్మకు అందించారు. ఆందోళనలో మంజుల, ప్రతిభారెడ్డి, సురేఖ తదితరులున్నారు.

నరేగ పనులు ప్రారంభించండి

రాయచూరు రూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో నరేగ పథకం పనులను ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని గ్రామీణ కూలి కార్మికుల సంఘం సంచాలకుడు అభయ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం టిప్పుసుల్తాన్‌ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. ప్రస్తుతం వేసవిలో పొలం పనులు లభించవని, వ్యవసాయ కూలీ కార్మికులకు ఏడు రోజుల పనులు కల్పించాలని, కూలీ డబ్బుల బకాయిలను చెల్లించి నరేగ పథకం కింద పనులను సక్రమంగా జరిగేలా చూడాలన్నారు.

వేతన బకాయిలు

చెల్లించరూ

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అతిథి ఉపాధ్యాయులకు వేతన బకాయిలు చెల్లించాలని ఏఐడీవైఓ డిమాండ్‌ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చెన్నబసవ మాట్లాడారు. జిల్లాలో ఆవిష్కార పథకం కింద నియమించుకున్న ఉపాధ్యాయులకు గత ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వేతన బకాయిల ను వెంటనే చెల్లించాలని కోరుతూ డీడీపీఐ జగదీష్‌కు వినతిపత్రం సమర్పించారు.

పోక్సో కేసులో

ముత్యాకు నో బెయిల్‌

హుబ్లీ: ఇటీవల సోషల్‌ మీడియాలో వైరలైన బాలికతో అనుచితంగా ప్రవర్తించిన కేసులో మల్లికార్జున ముత్యా దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ రిట్‌ను కోర్టు డిస్మిస్‌ చేసింది. ఆ మేరకు యాదగిరి జిల్లా ప్రధాన, ప్రత్యేక సెషన్స్‌ కోర్టు ఆదేశాలు వెల్లడించింది. కాగా ముత్యాపై పోక్సో కేసు దాఖలైన సంగతి తెలిసిందే. దీంతో సదరు కోర్టు న్యాయమూర్తి మరుళ సిద్దారాధ్య ఈ మేరకు ముత్యా ముందస్తు బెయిల్‌ రిట్‌ను డిస్మిస్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు.

జానపద గాయని మృతి

హొసపేటె: విజయనగర జిల్లా హూవినహడగలి తాలూకాలోని సోగి గ్రామానికి చెందిన జానపద గాయని డి.హొన్నమ్మ(78) వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో సోమవారం మరణించారు. అనేక జానపద పాటలు పాడటం ద్వారా జిల్లాలో తనదైన ముద్ర వేసిన గాయని గ్రామ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement