రాయచూరు రూరల్: నిర్మాణంలో ఉన్న ఇంటి మెట్ల వరుస, గోడ కూలి దంపతులు దుర్మరణం పాలైన ఘటన రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకాలో చోటు చేసుకుంది. సోమవారం యలగట్టిలో ఇంటి నిర్మాణ సమయంలో దంపతులిద్దరూ గార పనుల్లో తలమునకలుగా ఉన్నారు. అయితే నాసిరకంగా, పిల్లర్లు లేకుండా ఇంటిపైకి వెళ్లడానికి గోడకు ఆనుకుని నిర్మించిన మెట్ల వరుసతో పాటు గోడ ఆకస్మికంగా కూలిపోవడంతో ద్యావప్ప సూగూరు(38)శివమ్మ(32) అనే దంపతులు మరణించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం లింగసూగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు హట్టి పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ తెలిపారు.
క్షుణ్ణంగా వాహన తనిఖీలు
● 586 వాహనాల
యజమానులకు జరిమానా
హొసపేటె: జిల్లా పోలీసు శాఖ, ఆర్‌టీఓ సంయుక్తంగా లోపభూయిష్ట నంబర్ ప్లేట్లు ఉన్న వాహన యజమానులపై చర్యలు ప్రారంభించాయి. 586 వాహన డ్రైవర్లకు జరిమానా విధించారు. హొసపేటె సబ్‌డివిజన్‌లో 345, కూడ్లిగి సబ్ డివిజన్‌లో 154, హరపనహళ్లి సబ్‌డివిజన్‌లో 87తో సహా మొత్తం 586 కేసులు నమోదు కాగా జరిమానా వసూలు చేశారని ఎస్పీ జాహ్నవి తెలిపారు. ప్రజలు తమ వాహనాలు నడుపుతున్నప్పుడు డీఎల్‌ఆర్‌సీ, బీమా, కాలుష్య తనిఖీ సర్టిఫికెట్ వెంట పెట్టుకోవాలి. మోటార్ వాహన చట్టం ప్రకారం నెంబర్ ప్లేట్ క్రమం తప్పకుండా ఉండాలని తెలిపారు. నగరం అంతటా నెంబర్ ప్లేట్లపై ప్రచారం చేయడంతో పాటు హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించారు.
మహిళలు
ముందడుగు వేయాలి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో దుష్ట సంస్కృతి సంహారానికి మహిళలు ముందడుగు వేయాలని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పిలుపు ఇచ్చారు. ఆదివారం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. మహిళలు గగన యాత్రలు, సాంకేతిక, విజ్ఞాన సమాచార రంగాల్లో రాణిస్తున్నారన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలున్నాయన్నారు. భ్రూణ హత్యలు, వరకట్న మరణాలు వంటి విషయాల్లో న్యాయం, చట్టం తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో శారద, సురేఖ, సుమ, రాధ, రాబియా బేగం, రంజిత్‌లున్నారు.
ధైర్యంగా పరీక్షలు రాయండి
బళ్లారిఅర్బన్: పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్‌ఎస్‌ఎల్‌సీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ప్రత్యేక లేఖ రాశారు. నగర నియోజక వర్గంలో 45కు పైగా పాఠశాలల్లో చదువుతున్న సుమారు 3 వేల మంది విద్యార్థులకు ఆయన వ్యక్తిగతంగా ఈ లేఖను పాఠశాలల్లో విద్యార్థులకు అందేలా పంపించారు. ఈనెల 18న ప్రారంభమయ్యే ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలను విద్యార్థులు ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో పిల్లలపై ఒత్తిడి చేయకుండా వారిలో విశ్వాసం నింపి, ప్రోత్సాహం అందించాలని సూచించారు.


