రాయచూరు రూరల్: రాయచూరు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(ఆర్‌టీపీఎస్)లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించకుండా అధికారులు కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆర్‌టీపీఎస్ కార్మికుల సంఘం అధ్యక్షుడు మహామని అయ్యన్న ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 నుంచి 25 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహించిన కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. వారికి రావాల్సిన పీఎఫ్, జీపీఎఫ్, గ్రాచ్యుటీలను ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని తప్పుబట్టారు. కూలీ కార్మికులకు చెల్లించాల్సిన రూ.10 కోట్లను సొంతానికి వాడుకున్న విషయంపై సమగ్ర విచారణ జరపాలన్నారు.
రిజర్వేషన్ కల్పించాలని ధర్నా
రాయచూరు రూరల్: ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ కొలువుల్లో నియామకాలకు అవకాశాలు కల్పించొద్దని కర్ణాటక చలవాది జిల్లా మహాసభ సంచాలకుడు విశ్వనాథ్ పట్టి డిమాండ్ చేశారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ సీఎంకు పంపదలచిన వినతిపత్రాన్ని తహసీల్దార్ సురేష్‌వర్మకు సమర్పించారు.
అగ్నిప్రమాదంలో
వెదురు బొంగులు దగ్ధం
సాక్షి,బళ్లారి: నగరంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కోట ప్రాంతంలోని ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా మేదర సమాజం వారు వ్యాపారం కోసం తెచ్చి పెట్టిన వెదురు బొంగులు, కట్టెల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పేందుకు శ్రమించారు. ఈ ఘటనలో వెదురు కట్టెలు పూర్తిగా కాలిపోయాయి. రూ.లక్షలాది మేర నష్టం వాటిల్లింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


