బళ్లారిటౌన్: ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న జనాభా లెక్కింపు ప్రక్రియను అధికారులంతా బాధ్యతతో నిర్వహించాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ సభాంగణంలో అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కోవిడ్ వల్ల 2021లో జరగవలసిన దేశంలోని ప్రధాన జనాభా లెక్కింపు వాయిదా పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొత్తగా సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి జనాభా లెక్కింపులో మొదటి సారిగా నూతన పరిజ్ఞానంతో ఆన్‌లైన్ ద్వారా వివరాలను సేకరిస్తున్నారన్నారు. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ప్రజలే స్వచ్ఛందంగా వివరాలు నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారన్నారు. ఏప్రిల్ 16 నుంచి మే 16 వరకు ఇంటింటా సమీక్ష చేపడతారన్నారు. జెడ్పీ సీఈఓ మహ్మద్ హ్యారీష్ సుమేర, డీడీసీఓ జ్ఞాన ప్రకాశం, పాలికె కమిషనర్ మంజునాథ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


