యువకుడిని హత్య చేసి.. శరీరాన్ని ముక్కలు చేసి.. | - | Sakshi
Sakshi News home page

యువకుడిని హత్య చేసి.. శరీరాన్ని ముక్కలు చేసి..

Mar 6 2026 8:20 AM | Updated on Mar 6 2026 8:20 AM

బ్యాగ్‌లో వేసి పారేసిన దుండగులు

హొసపేటె: యువకుడిని దారుణంగా హత్య చేసిన నిందితులు, మృతదేహ శరీర భాగాలను కత్తిరించి, ప్లాస్టిక్‌ సంచిలో నింపి, విసిరి వేసి పారిపోయిన ఘటన విజయనగర జిల్లాలోని హువిన హడగలి తాలూకా బీరబ్బి గ్రామంలో జరిగింది. హత్యకు గురైన యువకుడిని గ్రామానికి చెందిన వీరేష్‌(25)గా గుర్తించారు. హత్యకు గురైన బీరేశ్‌ గత 15 రోజులుగా కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. అయితే బుధవారం సాయంత్రం బీరేశ్‌ మృతదేహం ఇంటి వెనుక కనిపించింది. ఏదైనా చనిపోయిన జంతువు కళేబరం నుంచి దుర్వాసన వస్తుందేమో అని వారు తనిఖీ చేయగా, బీరేశ్‌ మృతదేహం కనిపించింది. హంతకులు శరీర భాగాలను ముక్కలుగా కోసి ప్లాస్టిక్‌ సంచిలో నింపినట్లు వెలుగులోకి వచ్చింది. మృతుడు బీరేశ్‌ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. సమాచారం అందిన తర్వాత విజయనగర ఎస్పీ జాహ్నవి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హిరేహడగలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడికి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

రేపు బెళగావిలో జిల్లా స్థాయి ఉద్యోగ మేళా

హుబ్లీ: బెళగావిలోని శివబసవ నగర్‌లోని ఎస్‌జీ బాళెకుంద్రి సాంకేతిక కళాశాలలో ఈ నెల 7న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా స్థాయి ఉద్యోగ మేళాను ఏర్పాటు చేశామని ఆ జిల్లా జెడ్పీ సీఈఓ రాహుల్‌ సింధె తెలిపారు. జిల్లా యంత్రాంగం, జెడ్పీ, కౌశల్య అభివృద్ధి తదితర సంస్థలు, సిద్దరామేశ్వర విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళా జరగనుందన్నారు. మేళాను జిల్లా ఇన్‌చార్జి మంత్రి సతీష్‌ జార్కిహొళి, రాష్ట్ర సీ్త్ర శిశు శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ ప్రారంభిస్తారన్నారు. ఎమ్మెల్యే ఆసిఫ్‌ సేఠ్‌, వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్‌ పాటిల్‌ ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. 100కు పైగా కంపెనీలు తమకు కావాల్సిన ఉద్యోగ నియమాలను చేపడతారన్నారు. 10వ తరగతి, పీయూసీ, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ తదితర అర్హతలు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

రిమ్స్‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ధర్నా

రాయచూరు రూరల్‌: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్‌) కళాశాల ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు గురువారం ఆస్పత్రి ముందు భాగంలో విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆనంద్‌ మాట్లాడుతూ మైసూరుకు చెందిన స్విస్‌ కంపెనీ యాజమాన్యం గత రెండు, మూడు నెలల నుంచి వేతనాలు, పీఎఫ్‌, జీపీఎఫ్‌, బోనస్‌ వంటివి చెల్లించకుండా, పైగా వేతనాల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు కోత కోయడాన్ని తప్పుబట్టారు. న్యాయసమ్మతంగా బకాయి వేతనాలను త్వరగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో రమేష్‌, సందీప్‌, నరేష్‌, వినోద్‌, అనురాధ, సునీత, మల్లికార్జున, పుష్ప, ఈరమ్మ, శ్రీనివాస్‌, అమరమ్మ, విశ్వనాథ్‌, నవీన్‌ కుమార్‌, ప్రశాంత్‌లున్నారు.

కార్మికులకు కనీస వేతనాలివ్వరూ..

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ డిమాండ్‌ చేసింది. గురువారం టిప్పుసుల్తాన్‌ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు వీరేష్‌ మాట్లాడారు. అసంఘటిత రంగంలో విధులు నిర్వహించే కార్మికులకు నెలకు రూ.37 వేల నుంచి రూ.43 వేల వరకు వేతనాలు చెల్లించేలా సర్కార్‌ బడ్జెట్‌లో ప్రవేశ పెట్టి వారిని ఆదుకోవాలని కోరుతూ జిల్లా స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

మత సామరస్యం

చాటిన ముస్లింలు

హుబ్లీ: హోలీ పండుగలో ముస్లింలు మత సామరస్యాన్ని చాటి దేశ సమైక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలిచారు. జిల్లాలోని కలఘటిగి పట్టణంలో గ్రామ దేవత జాతరలో అంజుమన్‌ ఇస్లాం సంస్థ ప్రముఖులు ఒడి నింపడమే కాకుండా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. స్వయంగా వారే వడ్డించి మత సామరస్యాన్ని చాటిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలై సర్వత్రా ప్రశంసలందుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement