సాక్షి,బళ్లారి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన అమానుష ఘటన కలకలం రేపింది. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హగరిబొమ్మనహళ్లి తాలూకా హంపా పట్టణలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో మరుగుదొడ్లు కంపు కొడుతున్న నేపథ్యంలో శుభ్రం చేయించాల్సిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏకంగా విద్యార్థులతో శుభ్రం చేయించారు. వారికి మరుగుదొడ్లు శుభ్రం చేస్తే అరటిపండ్లు ఇస్తానని ఆశ చూపించడంతో పాటు, వారిని బెదిరించి శుభ్రం చేయించారు. కాగా విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతారని బడికి పంపితే మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తారా? ఇదేం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు
ఈ ఘటనతో విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బాలల హక్కులను కాపాడాల్సిన ఉపాధ్యాయులే కాలరాస్తే ఎవరితో చెప్పుకోవాలి? అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సదరు అధికారులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు. బాలల హక్కల పరిరక్షణ సంఘాలు కూడా తీవ్రంగా ఖండించాయి. గతంలో కూడా విద్యార్థులతో పలు పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ బుద్ది తెచ్చుకొని పని చేయాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా, విద్యార్థులపై చులకన భావంతో వ్యవహరిస్తూ, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
మరుగుదొడ్లు శుభ్రం చేయించిన
ఉపాధ్యాయులు
అమానుష ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల మండిపాటు


