హుబ్లీ: కోర్టు మెట్లెక్కిన భార్యాభర్తల మధ్య వివాద వాజ్యంలో భార్యకు జీవన భృతి చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని భర్త కిరాయి హంతకులతో ఆమెను మట్టుబెట్టిన ఘటనలో మిస్టరీ వీడింది. ఈ కేసులో ధార్వాడ జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య తెలిపిన వివరాలు.. ధార్వాడ తాలూకా సోమాపుర నివాసి లలిత (42) హతురాలు. 2002లో నరేంద్ర గ్రామానికి చెందిన ఉదయ్‌కుమార్ అతరికితో సోమాపుర నివాసి లలితకు వివాహం జరిగింది.
నలుగురు నిందితుల అరెస్టు
నరేంద్రకు చెందిన భర్త ఉదయ్‌కుమార్, అతడి స్నేహితులైన గరగ గ్రామ నాగప్ప మడివాళప్ప, నచ్చనకి గ్రామ అభిషేక్, దూడవాడ గ్రామ నాగరాజ మడివాళప్ప హత్యలో పాల్గొన్న నిందితులు. వీరిని అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి పంపించామన్నారు. హత్యకు వాడిన థార్ వాహనం, నాలుగు మొబైల్స్, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
గత నెల 26న సవదత్తి రోడ్డులో అమ్మినబావి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సోమాపురకు చెందిన లలిత మృతి చెందారు. ప్రమాద దృశ్యం ఓ బస్సు కెమెరాలో రికార్డు అయింది. దీన్ని పోలీసులు పరిశీలించి పథకం ప్రకారం ప్రమాదం చేసినట్లుగా తేల్చారు.
విభేదాలతో పుట్టింటికి లలిత
కొన్నేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తి లలిత పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఇటీవల లోక్ అదాలత్‌లో లలితకు ఉదయ్‌కుమార్ జీవనభృతిగా 1.5 ఎకరాల పొలం ఇవ్వాలని ఆదేశించారు. దీంతో భర్త తన భార్య లలితను హత్య చేయడానికి రూ.40 లక్షలకు కిరాయి ఒప్పందం చేసుకొని పథకం రూపొందించాడు.
మాట్లాడదాం రమ్మని పిలిచి..
ఆ పథకం ప్రకారం గత నెల 26న మాట్లాడుదాం రమ్మని సవదత్తి రోడ్డుకు భార్యను పిలిపించుకున్న ఉదయ్‌కుమార్ తన స్నేహితులను ఉపయోగించుకొని నెంబర్ ప్లేట్ లేని నల్ల రంగు థార్ వాహనం ద్వారా ప్రమాదం చేయించారు. సీసీ కెమెరాల ద్వారా సదరు కారును, నలుగురు నిందితులను దర్యాప్తులో గుర్తించి కోర్టుకు చార్జిషీట్ సమర్పించామన్నారు.
అది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్‌తో హత్య
ధార్వాడ జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య వెల్లడి


