హొసపేటె: విజయనగర జిల్లా హూవినహడగలి తాలూకాలోని ఉత్తంగి గ్రామ సమీపంలో సుంకమ్మనహళ్ల వద్ద చెళ్లకెరె– హడగలి రాష్ట్ర రహదారిలో మంగళవారం సిమెంట్ లారీ, పొద్దు తిరుగుడు విత్తనాల బస్తాలను తీసుకెళుతున్న ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటన మంగళవారం జరిగింది. ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీ రోడ్డు పక్కకు, సిమెంట్ లోడ్‌తో ఉన్న లారీ రోడ్డు మధ్యన బోల్తా పడి పోయింది. లారీలోని సిమెంట్ బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ట్రాక్టర్, లారీల మధ్య జరిగిన ప్రమాదంతో రహదారిలో కొన్ని గంటల పాటు వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనపై ఇటిగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


