కెంపేగౌడ విమానాశ్రయంలో కటకట
● అరబ్ దేశాలలో చిక్కుకున్న కర్ణాటక ప్రయాణికుల సాయానికి వినతి
● రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ల ఏర్పాటు
● బెంగళూరు ఎయిర్‌పోర్టులో
అనేక విమానాల రద్దు
● కొనసాగుతున్న ఇబ్బందులు
బనశంకరి: అమెరికా, ఇజ్రాయెల్– ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల విమానాశ్రయాల్లో చిక్కుకున్న కన్నడిగులను సురక్షితంగా తీసుకురావడానికి సహాయం కోరుతూ సీఎం సిద్దరామయ్య, ప్రధాని నరేంద్రమోదీకి సోమవారం లేఖ రాశారు. ‘విమానాలు రద్దు కావడంతో అక్కడ ఉన్న కన్నడిగులు క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా యుఏఈ (దుబాయ్) లాంటి చోట్ల అనేకమంది ఉన్నారు. విదేశాంగ శాఖ, పౌర విమానశాఖ సమన్వయంతో వారిని స్వస్థలాలకు తీసుకురావాలి. బాధితులకు, వారి కుటుంబాలకు సమాచారం అందించడానికి కేంద్రీకృత డిజిటల్ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. విమాన టికెట్ల జారీని సరళతరం చేయాలి’ అని లేఖలో విన్నవించారు.
109 మంది చిక్కుకున్నారు..
మంత్రి కృష్ణ భైరేగౌడ
శివాజీనగర: యుద్ధపీడిత దేశాల్లో సుమారు 109 మంది కన్నడిగులు చిక్కుకున్నారు, వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడుతున్నట్లు రెవెన్యూ మంత్రి కృష్ణభైరేగౌడ తెలిపారు. సోమవారం విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ శనివారం రాత్రి నుంచే హెల్ప్‌లైన్ ఆరంభించాం. ఇప్పటి వరకు 109 మంది సమాచారం ఇచ్చారు. తాము భయంభయంగా ఉన్నామని, ప్రత్యేక విమానం ద్వారా కాపాడాలని వారు కోరుతున్నారు. విమానాలు నడవడం లేదు, గగనతలాలు తెరిచేవరకూ ఓపికగా ఉండాలి అని మంత్రి తెలిపారు. హెల్ప్‌లైన్ 22253707కు ఫోన్ చేస్తే సాయానికి చర్యలు తీసుకుంటామన్నారు. దుబాయ్, బహ్రెయిన్ ఎయిర్‌పోర్టుల్లో కన్నడిగులు చిక్కుకొన్నారు, అక్కడ సౌకర్యాలు లేవని చెబుతున్నారు. బయటికి వెళ్లనివ్వడం లేదంటున్నారు.. సహాయం చేయాలని అక్కడి భారత ఎంబసీలను కోరతామని చెప్పారు.
దుబాయ్‌లో ఏ జిల్లావారు ఎందరు?
బళ్లారి వాసులు– 32 మంది, బెంగళూరువాసులు – 25, చిక్కమగళూరు– 5, చిక్కబళ్లాపుర– 2, దక్షిణ కన్నడ– 3, చిత్రదుర్గ– 2, దావణగెర– 9, కొడుగు– 4, విజయపుర– 4, రాయచూరు– 3, శివమొగ్గ– 3, ఉడుపి– 2, కల్బుర్గి–2, ఇతర జిల్లాలకు చెందిన నలుగురు దుబాయ్ విమానాశ్రయంలో ఉన్నారు.
హెల్ప్‌లైన్ సేవలు
శివాజీనగర: ఆయా దేశాల్లో చిక్కుకున్న బెంగళూరు నగర జిల్లాకు చెందిన వారికి సహాయంగా ప్రభుత్వం సహాయవాణిలను ప్రారంభించింది. చిక్కుకొన్నవారి పేరు, పాస్‌పోర్టు వివరాలు, ప్రస్తుతం ఉన్న స్థలం, మొబైల్ నంబరు ఇస్తే సంప్రదించి సాయం చేస్తామని జిల్లాధికారి తెలిపారు.
ఫోన్ నంబర్ 080–22967200, వాట్సాప్ నంబర్–810599707, 9538047199 లకు మెసేజ్ ద్వారా గానీ లేదా కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. బాధితులకు సాయానికి చర్యలు తీసుకుంటామన్నారు.
యుద్ధం ముగిసేదాకా ఇంతే: కుమారస్వామి
మైసూరు: ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం ముగిసే వరకు కన్నడిగులను రాష్ట్రానికి తిరిగి తీసుకురావడం కష్టం, రద్దయిన విమానాలు తిరిగి ప్రారంభమైతే, సురక్షితంగా తిరిగి వస్తారు అని కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ, మధ్యాసియాలో యుద్ధం వల్ల విమానాలను నిలిపివేశారన్నారు. దుబాయ్‌లో స్థిరపడిన కన్నడిగులు అక్కడ విమానాశ్రయంలో చిక్కుకున్న కన్నడిగులకు సహాయం చేయడానికి వచ్చారు, చాలా మంది నాతో కూడా సంప్రదిస్తున్నారు అని చెప్పారు.
ప్రధాని మోదీకి సీఎం సిద్దు లేఖ
బాంబులు పడుతున్నాయి
అబూదాబిలో హావేరి టెక్కీ ఆందోళన
హుబ్లీ: అబూదాబిలో హావేరికి చెందిన ఓ ఐటీ ఇంజనీరు కుటుంబీకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. యుద్ధం వల్ల ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామని, వెంటనే భారతదేశానికి వచ్చేలా చేయాలని హావేరి తాలూకావాసి కుదరి కోరుతున్నారు. అక్కడి కష్టాలను వివరించారు. ఉద్యోగం చేస్తూ మొదట నేను ఒక్కడినే అబూదాబిలో ఉండేవాడిని, నెల కిందట భార్య, ఇద్దరు పిల్లలను తీసుకొచ్చాను. ఇక్కడి పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. మేము నివసించే భవనం దగ్గరలో బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి, చాలా భయంగా ఉందని తెలిపారు.
దొడ్డబళ్లాపురం: యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో కష్టాలు కొనసాగుతున్నాయి. అరబ్ దేశాలు గగనతలాన్ని మూసివేసిన కారణంగా విమాన ప్రయాణాలు సాగడం లేదు. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 10 విమానాలు, ఇక్కడకు రావాల్సిన 12 విమానాలు ఎగరలేకపోయాయి. అబుదాబి, జెడ్డా, దోహా, దుబాయ్, బహ్రెయిన్ తదితరాలకు వెళ్లాల్సిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ విమానాలు నేలకే పరిమితమయ్యాయి. అలాగే మంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.


