నంజన్న ఆర్జనలో భారీ తగ్గుదల | - | Sakshi
Sakshi News home page

నంజన్న ఆర్జనలో భారీ తగ్గుదల

Mar 3 2026 7:31 AM | Updated on Mar 3 2026 7:31 AM

హుండీలలో రూ.82 లక్షల లభ్యం

మైసూరు: దక్షిణ కాశీగా పిలువబడే మైసూరు జిల్లాలోని శ్రీ నంజుదేశ్వర స్వామి ఆలయంలో హుండీలలో విరాళాల సేకరణ రూ.82 లక్షలుగా తేలింది. ఆలయానికి ఆదాయంలో భారీ తగ్గుదల కనిపించింది. గతంలో కోట్లు దాటిన నంజన్న ఆర్జన ఇప్పుడు లక్షలకు తగ్గింది. సోమవారం ఆలయంలోని దాసోహ భవన్‌లో జరిగిన హుండీల లెక్కింపులో, గత ఫిబ్రవరి నెలకుగాను మొత్తం రూ.82,30,313 నగదు లభ్యమైంది. అలాగే 19 గ్రాముల బంగారం, సుమారు కేజీ వెండి సొత్తు ఉన్నాయి. ఆమెరికా, ఇంగ్లండ్‌, అరబ్‌ దేశాలు సహా మొత్తం 47 దేశాల డబ్బులు కనిపించాయి. దీంతో విదేశాల నుంచి ఎక్కువమంది భక్తులు నంజన్న దర్శనం చేసుకున్నట్లు తెలిసింది. ప్రతి నెలా నంజుండేశ్వరుని హుండీలను లెక్కిస్తే రూ. 1 నుంచి 2 కోట్ల మధ్యలో రాబడి వచ్చేది. కానీ ఈసారి చాలా తక్కువ మొత్తం సమకూరిందని ఆలయ సిబ్బంది తెలిపారు.

మైసూరు సిల్కు ఫ్యాక్టరీని మూసివేయం

మైసూరు: టి.నరసీపురలో ప్రతిష్టాత్మక మైసూర్‌ సిల్క్‌ దారం తయారీ కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయబోమని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి హెచ్‌సి మహదేవప్ప చెప్పారు. అక్కడ స్టేడియం కట్టేందుకు సిల్క్‌ ఫ్యాక్టరీని మూసివేయవచ్చా అని విలేకరులు ప్రస్తావించగా, ఫ్యాక్టరీని మూసివేసి స్టేడియం నిర్మిస్తామని మేము చెప్పలేదన్నారు. మైసూర్‌ వారసత్వాన్ని, ప్రతిష్టను పెంచే మైసూర్‌ సిల్క్‌ ఫ్యాక్టరీ, మైసూర్‌ శాండల్‌ సోప్‌ వంటి ఫ్యాక్టరీలను మూసివేయడం సాధ్యమేనా? అన్నారు. కొందరు అనవసర రాజకీయాలు చేస్తున్నారన్నారు. స్టేడియానికి మరో స్థలాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

పాస్‌పోర్టు ఆఫీసుకు

బాంబు బెదిరింపు

శివాజీనగర: బెంగళూరులో ఉత్తుత్తి బాంబు బెదరింపుల వరుస కొనసాగుతోంది. కోరమంగల ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యలయానికి సోమవారం గుర్తుతెలియని ఈమెయిల్‌ వచ్చింది, తమిళ భాషలో ఉన్న ఈమెయిల్‌లో.. అజ్మల్‌ కసబ్‌కు మరణ శిక్ష విధించిన మిమ్మల్ని మేము వదిలపెట్టబోమన్నారు. కొంతసేపటిలో మీ ఆఫీసులో ఉంచిన బాంబులు పేలిపోతాయని రాసి ఉంది. పోలీసులు, బాంబు స్క్వాడ్‌ ఆఫీసులోని ప్రజలు, సిబ్బందిని బయటకు పంపి తనిఖీలు చేశారు. దీనివల్ల గంటలకొద్దీ పనులు స్తంభించి దరఖాస్తుదారులు ఇబ్బందులు పడ్డారు. చివరకు ఎలాంటి పేలుడు వస్తువులు లభించలేదు. ఇదొక ఉత్తుత్తి మెసేజ్‌ అని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 16న రాష్ట్రంలో అనేక కోర్టులకు ఇదే మాదిరి ఈమెయిల్స్‌ రావడంతో పనులు నిలిచిపోయాయి. తరచూ ఈమెయిల్స్‌ రావడం, భయాందోళన రేకెత్తడం పరిపాటిగా మారింది. ఇలాంటి దుండగులకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్‌ చేశారు.

కామాంధునికి కటకటాలు

తుమకూరు: గుబ్బి తాలూకాలోని హొసహళ్లిలో బాలికపై అఘాయిత్యం చేసి పరారీలో ఉన్న కామాంధున్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తుమకూరు తాలూకాకు చెందిన రేణుకయ్య (26) పశువుల వ్యాపారి, గుబ్బి తాలూకాలోని కె.జి. ఆలయంలో జరిగిన పశువుల సంతకు వచ్చాడు. జి.హోసహళ్లి గ్రామంలో పాఠశాల నుంచి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తున్న ఏడో తరగతి బాలికను నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి పారిపోయాడు. గ్రామస్తులు, బాలిక తల్లిదండ్రులు కలిసి గుబ్బి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పరారీలో ఉన్న అతన్ని పట్టుకుని విచారించగా, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడే మనస్తత్వం ఉన్నవాడని గుర్తించారు. గతంలోనూ తుమకూరు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడి బహిరంగంగా దెబ్బలు తిన్నాడని తెలిసింది. అతనికి పెళ్లయి, భార్య గర్భంతో ఉంది. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement