సీఎం కుర్చీ కోసం రభస జరుగుతున్న తరుణంలో ప్రత్యర్థుల వ్యూహాలను కనిపెట్టి చెక్ పెట్టడానికి ప్రభుత్వ పెద్దలు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. దీంతో పదవీ కలహం కొత్త మలుపు తిరిగింది.
శివాజీనగర: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆయన వర్గం నేతల మీద ప్రత్యేకంగా ఓ ఎస్పీతో సీఎం సిద్దరామయ్య నిఘా వేశారని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. సోమవారం నగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన, డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలపై నిఘా ఉంది, అనధికారికంగా సీఎం ఓ సిట్‌ను నడిపిస్తున్నారు, డీకే వర్గంవారు ఏం చేసేదీ కనిపెట్టడమే సిట్ పని అని తెలిపారు. కాంగ్రెస్ చీలిపోయిన ఇల్లుగా మారింది, సీఎం, డీసీఎం వర్గీయులు వీధుల్లోకి తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో కొనసాగదు అని జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని రుణాల భారంలోకి దించుతున్నారన్నారు. ధనవంతులు గ్యారెంటీ సంక్షేమ పథకాలను వదులుకోవాలని మంత్రి ఎం.బీ.పాటిల్ చెప్పడాన్ని ప్రస్తావించారు, అందరికీ గ్యారెంటీలు అనే మాటను తప్పుతున్నారన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ నిజం: కుమారస్వామి
కేంద్రమంత్రి కుమారస్వామి మైసూరులో మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అన్నారు. నేను నిజం చెబుతాను, ప్రతి సర్కారూ ఫోన్ ట్యాపింగ్ సాగిందన్నారు. కానీ సొంత మంత్రులు, సొంత ఎమ్మెల్యేలపై నిఘా పెట్టడం ఇదే మొదటిసారి అని పరోక్షంగా సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి తమ ప్రభుత్వంపై నిఘా పెట్టడం ప్రారంభించడం విషాదమని అన్నారు.
డీసీఎం డీకే శివకుమార్ వర్గంపై
సీఎం సిద్దు నిఘా
బీజేపీ పక్ష నేత అశోక్ ఆరోపణ


