కదిరి: శౌర్యానికి, గాంభీర్యానికి, పరాక్రమానికి ప్రతీకగా నిలిచే సింహాన్నే వాహనంగా చేసుకుని ఖాద్రీశుడు తిరుమాడ వీఢుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కిరీటధారియై ఠీవిగా కనిపించిన ఖాద్రీశుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తజనం ఖాద్రీశా...గోవిందా అంటూ కీర్తించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గో రోజైన సోమవారం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి సింహ వాహనంపై ఊరేగారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నేడు హనుమంత వాహనం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష్మీ నారసింహుడు హనుమంత వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. చంద్రగ్రహణం కారణంగా పగలంతా ఆలయం మూసివేసి రాత్రి సమయంలో సంప్రోక్షణ తర్వాత తలుపులు తెరుస్తారు.


