వీడిన వాసవీ స్వగృహ హోంనీడ్స్ మిస్టరీ
బళ్లారి అర్బన్: బళ్లారి నగరంలోని బ్రూస్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భారీ మోసం కేసు మిస్టరీని పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం రూ.162 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 2025 ఏప్రిల్ 2న బ్రూస్‌పేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా 2025 ఏప్రిల్ 3న నిందితుల నుంచి రూ.19.38 లక్షల నగదును, అనంతరం 2025 ఏప్రిల్ 11న మరోసారి రూ.95 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాల పరిశీలనలో రూ.5 లక్షల నగదును ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన డీ పన్నేకర్ మార్గదర్శకత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీలు రవికుమార్, ఎస్.నవీన్ కుమార్, నగర ఉపవిభాగ డీఎస్పీ చంద్రకాంత్ నందారెడ్డి నేతృత్వంలో బ్రూస్‌పేట పోలీసు స్టేషన్ పీఐ మహంతేష్ సహా పోలీసు సిబ్బంది గాలింపు చేపట్టారు.
ఒంగోలులో నిందితుల పట్టివేత
పరారీలో ఉన్న టి.విశ్వనాథ్, అతని భార్య విశాలాక్షి, కుమారుడు విష్ణువర్ధన్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నట్లు సమాచారం అందడంతో గత నెల 26న మధ్యాహ్నం ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం జనవరి 27న కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని జుడీషియల్ కస్టడీకి తరలించారు. తదుపరి విచారణలో ప్రధాన నిందితుడు టి. విశ్వనాథ్ నుంచి గతనెల 29న రూ.37.39 లక్షల నగదు, 531.15 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం రూ.162 కోట్లకు పైగా నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని సంబంధిత కోర్టుకు నివేదిక సమర్పించినట్లు పోలీసు శాఖ వెల్లడించింది. ప్రధాన నిందితుడిని తదుపరి చర్యల కోసం మళ్లీ జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపింది.
కుటుంబ సభ్యులతో సహా
ప్రధాన నిందితుడు విశ్వనాథ్ అరెస్టు
రూ.162 కోట్లకు పైగా నగదు,
బంగారం స్వాధీనం
వీడిన వాసవీ స్వగృహ హోంనీడ్స్ మిస్టరీ


