రథంలో ఊరేగిన మల్లికార్జునుడు | - | Sakshi
Sakshi News home page

రథంలో ఊరేగిన మల్లికార్జునుడు

Feb 5 2026 7:39 AM | Updated on Feb 5 2026 7:39 AM

రథంలో

రథంలో ఊరేగిన మల్లికార్జునుడు

మైసూరు: జిల్లాలోని పిరియాపట్టణ తాలూకా బెట్టదపురలో చరిత్ర ప్రసిద్ధ భ్రమరాంబ సమేత సిడిలు మల్లికార్జునస్వామి, బెళ్లి బసప్ప, విఘ్నేశ్వరుల బ్రహ్మరథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. భక్తులు ఉఘే మల్లయ్య, ఉఘే గిరిజమ్మ, ఉఘే బెళ్లి బసప్ప అంటూ నినాదాలు చేస్తూ తేరును లాగారు. నవదంపతులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు రథంపైకి పండ్లు, పసుపు విసిరి మొక్కుకున్నారు. భక్తులు తెల్లవారుజాము నుంచే కొండపైకి 3300 మెట్లను ఎక్కి దైవదర్శనం చేసుకున్నారు.

త్వరలో మెట్రో రైలు చార్జీల పెంపు?

శివాజీనగర: నగర మెట్రో ప్రయాణికులకు మళ్లీ చార్జీల షాక్‌ తగిలే అవకాశముంది. ఈ నెలలోనే కనీసం 5 శాతం పెంచాలని బెంగళూరు మెట్రో అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. మెట్రో నిబంధనల ప్రకారం ప్రతి ఏటా చార్జీలను పెంచుకోవచ్చు. గతేడాది చార్జీలను భారీగా పెంచడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కొన్ని మార్గాల్లో 70 శాతం పెంచడంతో అన్ని పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి. ఇప్పటికే సామాన్య ప్రజలు మెట్రో చార్జీలంటే భయపడుతున్నారు. మళ్లీ బాదితే తట్టుకోలేరనే ఆందోళన వ్యక్తమవుతోంది.

బీఎండబ్ల్యూ కారు బీభత్సం

నిలిపి ఉన్న కారును ఢీ

భార్య మృతి, భర్తకు గాయాలు

శివమొగ్గ: జిల్లాలోని తీర్థహళ్లి తాలూకా మేగరవళ్లి సమీపంలో జాతీయ రహదారి–169ఏలో విలాసవంత బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించగా ఒక మహిళ మరణించగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారును అతి వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టడమే ప్రమాదానికి కారణం. వివరాలు.. మేగరవళ్లిలోని శ్రీదుర్గా పరమేశ్వరి దేవస్థానం అర్చకుడు అశోక్‌ జోగి తన భార్య మల్లిక (42)తో కలిసి కారులో వెళుతూ రోడ్డు పక్కన నిలిపాడు. ఆ సమయంలో తీర్థహళ్లి వైపు నుంచి వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి నిలిచి ఉన్న కారును ఢీకొంది. ఈ తీవ్రతకు నిలిపి ఉన్న కారులో ఉన్న దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు మణిపాల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా, దారిలో మల్లిక చనిపోయింది. భర్త చికిత్స పొందుతున్నారు. బీఎండబ్ల్యూ కారు డ్రైవరు కూడా గాయపడ్డాడు, అతనిపై ఆగుంబె పోలీసులు కేసు నమోదు చేశారు.

నకిలీ బంగారమిచ్చారు

మైసూరు: చామరాజనగర జిల్లా కొళ్లెగాలలోని ప్రైవేటు గోల్డ్‌ ఫైనాన్స్‌లో ఓ వ్యక్తి బంగారాన్ని కుదవపెట్టి డబ్బు తీసుకున్నాడు, అప్పు తీర్చాక నకిలీ బంగారాన్ని అంటగట్టారని లబోదిబోమన్నాడు. వివరాలు.. కొళ్లెగాల తాలూకా సిద్దయ్యనపుర గ్రామానికి చెందిన ఆనంద్‌ శంకర్‌ లమాణి ఇచ్చిన ఫిర్యాదులో.. 2023 మార్చి 11న తన బంగారు ఉంగరాన్ని రూ.15 వేల నగదుకు తాకట్టు పెట్టినట్లు తెలిపారు. ఫిబ్రవరి 2న రూ.30 వేలను చెల్లించి ఉంగరాన్ని పొందానని తెలిపారు. అయితే ఉంగరాన్ని చూసిన తర్వాత అనుమానం రావడంతో నగల షాపులో పరీక్షించగా నకిలీ బంగారం అని తెలిసింది. దీంతో న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రూ.60 లక్షల లంచం.. అబ్కారీ డీసీపై వేటు

మండ్య: లంచం డిమాండ్‌ చేయడంతో అబ్కారీ అధికారి సస్పెండ్‌ అయ్యారు. మండ్య జిల్లాలో సుందర్‌ అనే వ్యక్తికి మద్యం షాపు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని మంజూరు చేసేందుకు జిల్లా అబ్కారీ ఉప కమిషనర్‌ (డీసీ) ఆర్‌.నాగశయన ఏకంగా రూ. 60 లక్షలను డిమాండ్‌ చేశారు. ఈ ఆడియోలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. ఆర్‌.నాగశయనకు అబ్కారీ కమిషనర్‌ కార్యాలయం వివరణ కోరింది. చివరికి లంచం డిమాండ్‌ చేసినట్లు నిరూపితం కావడంతో సస్పెండ్‌ చేస్తూ అబ్కారీ ముఖ్య కార్యదర్శి అజయ్‌ ఎస్‌.కోరడ ఆదేశాలిచ్చారు. సస్పెన్షన్‌ కాలంలో బెళగావిలో ఉండాలని సూచించారు.

రథంలో ఊరేగిన మల్లికార్జునుడు 1
1/1

రథంలో ఊరేగిన మల్లికార్జునుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement