కుంగిపోయా.. క్షమించండి
● డెత్‌నోట్‌లో రాసిన సీజే రాయ్?
బనశంకరి: కాన్ఫిడెంట్ గ్రూప్ అధినేత, రియల్టర్ సీజే.రాయ్ ఆత్మహత్యకు ముందు 12 పేజీల డెత్‌నోట్ రాసినట్లు తెలిసింది. కంపెనీ ఉద్యోగులను తొలగించరాదని అందులో కుటుంబసభ్యులను కోరడం విశేషం. వ్యక్తిగతంగా, మానసికంగా కుంగిపోయానని, దీంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నానని, క్షమించాలని లేఖలో ప్రస్తావించారు. తమ కంపెనీల్లో ఎవరెవరు ఏ బాధ్యతల్లో ఉండాలనేది రాశారు. ఎవరి నుంచి ఎంత డబ్బు రావాలి అనేది కూడా తెలిపారు. సుదీర్ఘమైన లేఖను బట్టి ఆయన ఐటీ అధికారుల విచారణ విరామంలో కాకుండా, కొన్నిరోజుల ముందే రాసిపెట్టి ఉంటారని భావిస్తున్నారు.
ఐటీ అధికారుల వాంగ్మూలం
నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఎలాంటి డెత్‌నోట్ లభించలేదని చెప్పారు. సిట్ దర్యాప్తు చేస్తుందని, నివేదిక వచ్చాక సీజే.రాయ్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణం తెలుస్తుందని అన్నారు. ఐటీ అధికారులను సిట్ విచారించి వాంగ్మూలం నమోదు చేసుకుందని తెలిపారు.
పెంపుడు కుక్కలను
కట్టడి చేయలేరా?: హైకోర్టు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో కుక్కలను పెంచుకుంటున్న వారు తమ కుక్కలను కట్టడి చేయలేకపోవడం వల్ల జనంపై దాడులు ఎక్కువయ్యాయని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బెంగళూరులో ఒక వ్యక్తి పెంపుడు కుక్కను తీసుకువచ్చి మరో ఇంటి ముందు మలమూత్ర విసర్జన చేయించడంతో ఆ ఇంటివారు గొడవ చేశారు. ఇరువర్గాలూ అమృతహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నాయి. దీనిపై కుక్క యజమాని హైకోర్టును ఆశ్రయించాడు. విచారించిన కోర్టు.. యజమానిపై కేసు వద్దని స్టే విధించింది. ఇలాంటి రభస ఎక్కువ అవుతోందని జడ్జి నాగప్రసన్న అసహనం వ్యక్తం చేశారు.
బెంగళూరు – పూణె హైస్పీడ్ రైలు యోచన
యశవంతపుర: కేంద్రం నుంచి కర్ణాటకకు మరి కొన్ని హైస్పీడ్ రైలు కారిడార్‌ను తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి చెప్పారు. బెంగళూరు– పూణె నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా సమ్మతించారన్నారు.


