27 నుంచి ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు
కదిరి టౌన్: కోరి కొలిచిన భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న ఖాద్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలు మార్చి 13వ తేదీ మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి బ్రహ్మోత్సవాల వివరాలను బుధవారం విలేకరులకు తెలిపారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఈనెల 27వ తేదీ (శుక్రవారం) రాత్రి ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 28వ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి శ్రీవారి కల్యాణోత్సవం ఉంటుంది. మార్చి 1వ తేదీ హంస వాహనం, 2న సింహ వాహన సేవలు, 3న హనుమంతవాహనం, 4న బ్రహ్మగరుడసేవ, 5న శేష వాహనం, 6వ తేదీ ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ. 7న మోహినీఉత్సవం. 8న ప్రజాగరుడసేవ, 9న గజవాహనం, 10వ తేదీన కీలకమైన బ్రహ్మరథోత్సవం, 11న అలుకోత్సవం, అశ్వవాహన సేవ, 12వ తేదీన తీర్థవాది. 13వ తేదీ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. భక్తులు అందరూ పాల్గొని శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు.


