ప్రసంగంలో ఏముంది? | - | Sakshi
Sakshi News home page

ప్రసంగంలో ఏముంది?

Jan 23 2026 6:54 AM | Updated on Jan 23 2026 6:54 AM

ప్రసం

ప్రసంగంలో ఏముంది?

గవర్నర్‌ నిష్క్రమణం తరువాత అసెంబ్లీ పునఃప్రారంభం కాగానే ప్రభుత్వం తయారుచేసిన గవర్నర్‌ ప్రసంగాన్ని అసెంబ్లీ కార్యదర్శి ఎం.కే.విశాలాక్షి ప్రవేశపెట్టారు. ఇందులో తొలి 11 పేరాల్లో జీ రాం జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతూ ఉంది. తమ ప్రభుత్వం అన్ని రంగాలలో అద్భుత సాధనలను చేస్తోందని సర్కారు చెప్పుకొంది. అధికార వికేంద్రీకరణ చేసే రాష్ట్రాల్లో కర్ణాటక తొలి స్థానంలో ఉందన్నారు.

శివాజీనగర: ఉపాధి హామీ చట్టం (నరేగా) పునరుద్ధరణ కోసమని రాష్ట్ర ప్రభుత్వం విధానసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయగా, ప్రారంభోత్సవం రోజునే అనూహ్యమైన హైడ్రామా నడిచింది. గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగం చదవకుండా సొంతంగా రాసుకున్న ప్రసంగం చదివి సభ నుంచి నిష్క్రమించారు. గవర్నర్‌ వైఖరిపై అధికార కాంగ్రెస్‌ సభ్యుల ఆగ్రహం, నినాదాలు, సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ సభ్యుల నినాదాలతో అసెంబ్లీ గురువారం హోరెత్తింది.

గౌరవ వందనంతో..

సర్కారు తయారుచేసిన ప్రారంభోత్సవ ప్రసంగంలో కొన్ని అభ్యంతరకరమైన అంశాలున్నాయని, కాబట్టి అసెంబ్లీకి రాబోనని బుధవారం గవర్నర్‌ గెహ్లాట్‌ స్పష్టంచేసినట్లు తెలిసింది. అయితే మనసు మార్చుకుని గురువారం ఉదయం అసెంబ్లీకి చేరుకున్నారు. పోలీసు బలగాలు ఆయనకు గౌరవ వందనం సమర్పించాయి. సీఎం సిద్దరామయ్య, ఉభయ సభల సభాపతులు, మంత్రులు సాదర స్వాగతం పలికి అసెంబ్లీలోకి తోడ్కొని వెళ్లారు.

మూడు వాక్యాల ప్రసంగం

ఉదయం 11 గంటలకు సభలోకి విచ్చేసిన గవర్నర్‌.. సీఎం, సభాపతులు, మంత్రులు, సభ్యులకు అభినందనలు తెలిపారు. తన ప్రభుత్వ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పి, జై హింద్‌, జై కర్ణాటక అనేసి ముగించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఉపాధి హామీ చట్టం గొప్పతనం, జీ రాం జీ చట్టం వల్ల కలిగే నష్టాలు, కేంద్ర ప్రభుత్వ సవతి తల్లి ధోరణి.. ఇలా అనేక వ్యతిరేక అంశాలతో సిద్దరామయ్య సర్కారు ప్రసంగ పాఠాన్ని రూపొందించింది. దానిని బుధవారమే లోకభవన్‌కు పంపించింది. గవర్నర్‌ చర్యతో సిద్దరామయ్య, మంత్రులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

తీవ్ర రభస, గందరగోళం

సభాపతి స్థానంలో ఆసీనులైన గవర్నర్‌.. లాంఛనాలు పూర్తయ్యాక ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండా తాను సిద్ధం చేసుకున్న కాగితంలో నుంచి కొన్ని వాక్యాలను చెప్పి పూర్తి చేశారు. దీంతో అధికార సభ్యుల్లో అలజడి ఆరంభమైంది. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రసంగపు కాపీలను పట్టుకొని గవర్నర్‌ తప్పక ప్రసంగించాలని జోరుగా నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ సభ్యులు గవర్నర్‌ వైఖరిని సమర్థించారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేయటంతో కోలాహలం నెలకొంది. ఈ రభస మధ్యలోనే గవర్నరు పీఠం దిగి వడివడిగా నడుచుకుంటూ బయటికి వెళ్లారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ సభ్యులు ప్రసంగం చదవాలని నినాదాలను చేశారు. కొందరు సభ్యులు గవర్నర్‌ను వెంటాడి మరీ ఒత్తిడి చేశారు. ఆ సభ్యులను మార్షల్స్‌ పక్కకు నెట్టి గవర్నర్‌ బయటకు రావడానికి దారి కల్పించారు. తోపులాట జరుగుతుందేమోనని కొంతసేపు టెన్షన్‌ ఏర్పడింది. గవర్నర్‌కు రక్షణగా ఆయన భద్రతా సిబ్బంది, మార్షల్స్‌ వలయంగా ఏర్పడ్డారు. ఆయనకు అటు ఇటు సభాపతులు ఉన్నారు. కొందరు కాంగ్రెస్‌ సభ్యులు వెంటాడుతూ నినాదాలు చేశారు. గవర్నర్‌ మాత్రం తూర్పు ద్వారం నుంచి దిగి కారు ఎక్కి లోకభవన్‌ వైపు వెళ్లిపోయారు. ఆ తరువాత కూడా కాంగ్రెస్‌ సభ్యులు అసెంబ్లీలో నినాదాలు చేస్తూనే ఉన్నారు.

రాజ్యాంగ సంఘర్షణ..

అభ్యంతరకర అంశాలను ప్రసంగం నుంచి తొలగిస్తేనే ఉభయ సభల సమావేశానికి వస్తానని, లేదంటే రానని బుధవారమే గవర్నర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రాత్రి న్యాయ, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హెచ్‌.కే.పాటిల్‌ గవర్నర్‌ను కలిసి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా కూడా అంగీకరించలేదు. అభ్యంతరకర పదాలను తొలగించాలని సూచించారు. మంత్రి పాటిల్‌ సీఎం సిద్దరామయ్యను కలిసి వివరించారు. ఎలాంటి మార్పులు చేయం, గవర్నర్‌ ప్రసంగం చేసేందుకు రావాలి, ఇది రాజ్యాంగంలో ఉంది అని సీఎం చెప్పినట్లు తెలిసింది. చివరికి రాజ్యాంగ సంఘర్షణ ఏర్పడకుండా గవర్నర్‌ విచ్చేసి, వెళ్లిపోయారు.

సర్కారు ప్రసంగ పాఠం బేఖాతరు

మూడు ముక్కల్లో ముగించిన గెహ్లాట్‌

ఆగ్రహంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు,

ఎమ్మెల్సీల నినాదాలు

భద్రత మధ్య గవర్నర్‌ అసెంబ్లీ

నిష్క్రమణం

నరేగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే సెగలు

గవర్నర్‌పైనే గూండాయిజమా?: బీజేపీ

గవర్నర్‌ను కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుకోవడం చూస్తే గురువారం ఓ బ్లాక్‌ డే అని బీజేపీపక్ష నాయకుడు ఆర్‌.అశోక్‌ ఆరోపించారు. విధానసౌధలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ కర్తవ్యాన్ని నిర్వహించి, ధన్యవాదాలు చెప్పి వెళ్లారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ప్రసంగాన్ని చదవకుండా వెళ్లేందుకు ఆయనకు అధికారముందన్నారు. అయితే కాంగ్రెస్‌ సభ్యులు గవర్నర్‌ను అడ్డుకొని అగౌరవపరచడంతో పాటు గూండాయిజం చేశారని మండిపడ్డారు. దురుసుగా ప్రవర్తించినవారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని సభాపతులను కోరుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నడుచుకొంటోందని ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ఆరోపించారు. వైఫల్యాలను మరిపించేందుకు, ద్వేష రాజకీయాలకు అసెంబ్లీని వాడుకుంటోందన్నారు. నరేగా పథకంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులను తీసుచ్చిందని, దానినే నెపంగా చేసుకొని కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందన్నారు.

విపక్షం పట్టు.. నేడు చర్చకు ఓకే

గవర్నర్‌ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయాక, అధికార, ప్రతిపక్ష సభ్యులు ఆరోపణలు చేసుకున్నారు. న్యాయశాఖ మంత్రి హెచ్‌.కే.పాటిల్‌ మాట్లాడే సమయంలో బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. న్యాయశాఖ మంత్రితో పాటుగా అధికార పార్టీ సభ్యులు గవర్నర్‌ను అడ్డుకొని అగౌరవపరిచారని దుయ్యబట్టారు. దీనిపై చర్చించాలని బీజేపీ పక్ష నాయకుడు అర్‌.అశోక్‌ కోరారు. న్యాయశాఖ మంత్రి ఏ విషయాన్ని చెబుతారో వినాలని సభాపతి ఖాదర్‌ సూచించినా పట్టించుకోకుండా బీజేపీ సభ్యులు కేకలు వేశారు. చివరకు.. జరిగిన పరిణామాలపై శుక్రవారం సభలో చర్చిద్దామని స్పీకర్‌ హామీ ఇచ్చారు.

గవర్నర్‌పై న్యాయ మంత్రి విమర్శలు

పాటిల్‌ మాట్లాడుతూ గవర్నర్‌ జాతీయ గీతాన్ని అవమానించి, ప్రసంగాన్ని చదవకుండా పరుగెత్తి పోయే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. దీనిని సర్కారు తీవ్రంగా ఖండిస్తోందని, ఏం చేయాలో ఆలోచిస్తోందని చెప్పారు.

ప్రసంగంలో ఏముంది?1
1/5

ప్రసంగంలో ఏముంది?

ప్రసంగంలో ఏముంది?2
2/5

ప్రసంగంలో ఏముంది?

ప్రసంగంలో ఏముంది?3
3/5

ప్రసంగంలో ఏముంది?

ప్రసంగంలో ఏముంది?4
4/5

ప్రసంగంలో ఏముంది?

ప్రసంగంలో ఏముంది?5
5/5

ప్రసంగంలో ఏముంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement