రూ.6కు బదులు 60 వేలు ఫోన్‌పే
బనశంకరి: ఫోన్ పే చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక అంకె తప్పు పడినా ఖాతాకు చిల్లు పడుతుంది. ఓ ప్రయాణికుడు బీఎంటీసీ బస్సులో టికెట్ రూ.6 కు బదులు రూ.60 వేలు ఫోన్‌పే చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాలు... ఈ నెల 14వ తేదీన బనశంకరి నుంచి కదిరేనహళ్లికి వెళుతున్న బీఎంటీసీ బస్‌లో ప్రయాణికుడు టికెట్ తీసుకున్నాడు. ఫోన్ పేలో 6 రూపాయలు చెల్లించబోయి రూ.60 వేలు వేశాడు. పొరపాటు తెలుసుకుని కండక్టర్‌కు చెప్పగా, ఈ డబ్బును వెంటనే ఇవ్వడం సాధ్యం కాదని చెప్పాడు. డిపో కు వచ్చి ఉన్నతాధికారులతో మాట్లాడి, నగదు తీసుకోవచ్చని సూచించాడు. ప్రయాణికునికి రెండు మూడురోజుల్లో డబ్బును అందించే అవకాశం ఉందని కండక్టర్ తెలిపాడు.
జింకల మరణాలపై నివేదిక
దొడ్డబళ్లాపురం: దావణగెరె జిల్లా ఆనగోడులోని ఇందిరా ప్రియదర్శిని జూలో ఇటీవల నాలుగు చుక్కల జింకలు చనిపోవడం తెలిసిందే. పశువైద్యులు వాటి కళేబరాలకు పోస్టుమార్టం జరిపారు. సెప్టిసేమియ అనే వ్యాధితో జింకలు మృతిచెందాయని ల్యాబ్ నివేదికలు తెలిపాయి. ఈ నెల 16 నుంచి 18వ తేదీల మధ్యలో జింకలు మృత్యువాత పడ్డాయి. దీంతో మిగతా జింకలను వైద్య పరీక్షలు చేపట్టారు. జూలోకి ప్రజలను అనుమతించలేదు. కారణాలు తెలియడంతో మిగతా జింకలకు వైద్యం సులభమైందని వైద్యులు చెబుతున్నారు.
సుందర రామ..
సుమధుర రామా
మైసూరు: అయోధ్యలో శ్రీరాముని ఆలయ ప్రతిష్ట 2వ వార్షికోత్సవాన్ని నగరంలోని చాముండిపురంలో భక్తులు, స్థానికులు సంబరంగా చేసుకున్నారు. శ్రీరాముని చిత్రపటాలకు పూజలు చేసి అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. కరసేవకుల శతాబ్దాల పోరాటం, రామాలయం కల నెరవేరి రెండేళ్లయిందన్నారు. మైసూరు హోటల్ యజమానుల సంఘం అధ్యక్షుడు సీ.నారాయణగౌడ, ప్రముఖులు పాల్గొన్నారు.
ఖరీదైన వాచ్ బుక్ చేస్తే... ఆలుగడ్డ వచ్చింది
రాయచూరు రూరల్: ఆన్‌లైన్ షాపింగ్‌లో ఎప్పుడు ఏం వస్తుందో తెలియదు. అమాయకులకు మోసగాళ్లు ఇట్టే టోపీ వేస్తుంటారు. అలాంటిదే ఈ ఉదంతం. ఇన్‌స్టాలో బంపర్ ఆఫర్ అని వచ్చిన ప్రకటనను నమ్మి రూ. 5 వేలు పంపిన వ్యక్తికి షాకయ్యే ప్యాకేజీ వచ్చింది. ఈ సంఘటన రాయచూరు నగరంలో జరిగింది. యరమరాస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దగ్గుబాటి బాబు ప్రైవేటు సంస్థలో పనిచేస్తుంటాడు. జనవరి 13 న రూ.5 వేలు విలువ చేసే వాచ్‌ను రూ.1200 లకే ఇస్తున్నట్లు ఇన్‌స్టాలో ప్రకటన వచ్చింది, దానిని నమ్మిన బాబు ఆ ప్రకటనలోని నంబరుకు రూ.5 వేలు ఆన్‌లైన్‌లో చెల్లించి వాచ్‌ని బుక్ చేశాడు. బుధవారం పార్శిల్ రాగా ఎంతో ఉత్సాహంగా ఓపెన్ చేసి చూశాడు. అందులో నుంచి ఆలుగడ్డ బయటికొచ్చింది. దీంతో దగ్గబాటి బాబు రాయచూరు సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఇద్దరు దొంగల అరెస్టు
కోలారు: ముళబాగిలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ముళబాగిలు తాలూకా కృష్ణగిరి గ్రామానికి చెందిన యువతి (22), చలువనాయకనహళ్లి గ్రామానికి చెందిన మహిళ (40) పోలీసులు అరెస్టు చేసిన నిందితులు. వీరి వద్ద నుంచి మొత్తం 7 లక్షల విలువ చేసే 29 గ్రాముల బంగారు నగలు, 25 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడేవారని గుర్తించారు.
రూ.6కు బదులు 60 వేలు ఫోన్‌పే
రూ.6కు బదులు 60 వేలు ఫోన్‌పే
రూ.6కు బదులు 60 వేలు ఫోన్‌పే


