ప్రియుడే హంతకుడు
హుబ్లీ: ధార్వాడలో ఫార్మసీ విద్యార్థిని జకియా ముల్లా (19) హత్య కేసులో మిస్టరీకి తెరదించుతూ, ప్రియుడు షాబీర్ ముల్లా నిందితుడని ధార్వాడ గ్రామీణ పోలీసులు గుర్తించారు. చున్నీతో గొంతుకు బిగించి ఆమెను హత్య చేశాడని తెలిపారు. వివరాలు.. ధార్వాడ గాంధీచౌక్‌లో నివసించే జకియా మంగళవారం రాత్రి ల్యాబ్‌కు వెళ్తానని చెప్పి బయల్దేరింది. రాత్రయినా ఇంటికి రాలేదు, బుధవారం ఉదయం వినయ డెయిరీ వద్ద మృతదేహం పడి ఉంది. ఇది జంట నగరాలలో సంచలనం కలిగించింది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు, పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. కానీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని సమాచారం. అదే విషయమై ఘర్షణ జరిగి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
అమాయకునిలా నటన..
అక్కడ మృతదేహం పడి ఉన్నట్లు నిందితుడే జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్యకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చేదాక శవం దగ్గర ఉండి అమాయకునిలా నటించాడు. చివరికి కాల్ డేటా, ఇతరత్రా ఆధారాలతో బుధవారం అర్ధరాత్రి షాబీర్‌ను అరెస్ట్ చేశారు. అతని తండ్రి ఇది హత్య కాదు, ఆత్మహత్య అని చెప్పడంతో యువతి బంధువులు మండిపడ్డారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. దర్యాప్తు చేపట్టామని ఎస్పీ గుంజన్ ఆర్య తెలిపారు. ఇద్దరికీ పెళ్లి కూడా నిశ్చయం అయిందని తెలిసిందన్నారు. మృతురాలి బంధువు మహమ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ షాబీర్ తండ్రి ప్రారంభం నుంచి కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నించాడన్నారు. ఇది ఆత్మహత్య, త్వరగా అంత్యక్రియలు చేయాలని ఒత్తిడి చేశాడన్నారు. నిందితులను అరెస్ట్ చేసే వరకు మేము శవాన్ని తీసుకెళ్లమని చెప్పడంతో ఎస్పీ, ఏసీపీ తదితరులు వారికి నచ్చజెప్పారు.
ధార్వాడలో ఫార్మసీ విద్యార్థిని హత్య కేసు..
నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు


