మా‘స్టార్’ బీరప్ప సార్
రాయచూరు రూరల్: మా సార్ బీరప్పను బదిలీ చేయొద్దు అంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. వివరాలు.. కోప్పళ జిల్లా బహద్దూర్ బండి ప్రభత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయుడు బీరప్ప అండగి సొంత ఖర్చులతో విద్యార్థులకు విమానయానం చేయించారు. విద్యార్థులను ఆకట్టుకునేలా విద్యా బోధన చేశారు. విద్యార్థుల కలలు సాకారం చేసిన ఉపాధ్యాయుడికి విద్యాశాఖ అధికారులు బదిలీ ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులు, విద్యార్థులు ఏకమై బదిలీ అయిన బీరప్ప మాస్టార్‌ను పంపమని తెలిపారు. పాఠశాలకు తాళం వేసి నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోవైపు మధ్యాహ్న భోజనం కూడా వండొద్దంటూ గదికి తాళం వేశారు. హెచ్‌ఎం బీరప్ప విద్యార్థులకు ఎంత నచ్చజెప్పినా ఆందోళన విరమించలేదు. మధ్యాహ భోజనం తినకుండా మౌన ప్రతిఘటన చేశారు.
జక్కనాచారి
జీవన విధానం అలవర్చుకోండి
రాయచూరు రూరల్: అమర శిల్పి జక్కనాచారి జీవన విధానాన్ని అందరూ అలవర్చుకోవాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ సూచించారు. శనివారం నగరంలోని కాళికా దేవి అలయం వద్ద అమర శిల్పి జక్కనాచారి చిత్రపటానికి పూజలు చేశారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో నగర సభ, జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సాంస్కృతిక శాఖ, విశ్వకర్మ సమాజం నేతల ఆధ్వర్యంలో జక్కనాచారి చిత్రపటానికి పూజలు చేశారు. సమాజంలో మానవుడు దుర్మార్గం వైపు వెళ్లకుండా సన్మార్గంలో పయనించాలని దారి చూపిన మహనీయుడు జక్కనాచారి అని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ, విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్, తహసీల్దార్ సురేష్ వర్మ, విశ్వకర్మ సమాజం నేతలు మారుతి, బ్రహ్మయ్య, రాములు పాల్గొన్నారు.
వైద్య కళాశాల
ఏర్పాటు చేయాలి
రాయచూరు రూరల్: విజయపురలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ఆందోళన కార్యకర్త లలిత డిమాండ్ చేశారు. శనివారం విజయపుర జిల్లా ప్రభుత్వ ఆస్పతి వద్ద ఏఐడీఎస్ కార్యకర్తలతో కలసి ఆందోళన చేపట్టారు. విజయపురలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు విషయంలో జిల్లాలోని మంత్రులు, శాసన సభ్యులు మౌనం వహించడం సరికాదన్నారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో రూ.500 కోట్లతో ఆస్పత్రి నిర్వహణకు మంత్రి ఎంబీ పాటిల్, శాసన సభ్యుడు బసన గౌడ పాటిల్ యత్నాల్ ముందుకు రావడం తప్పన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు మద్దతుగా జిల్లాలోని మంత్రులు శాసన సభ్యులు పదవులకు రాజీనామాలు చేయాలని కోరుతూ ఆందోళనకారులు మంత్రి ఎంబీ పాటిల్ నివాసాన్ని ముట్టడించారు. మరో వైపు ఏఐడీయస్ కార్యకర్తలు రాస్తోరోకో చేపట్టి మద్దతు పలికారు.
దయా మరణం కల్పించాలని లేఖ
రాయచూరు రూరల్: బ్రతికి ఉన్న వ్యక్తికి మరణ ప్రమాణం పత్రం ఇవ్వడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి దయా మరణం కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాయచూరు జిల్లా మాన్విలో చోటు చేసుకుంది. మాన్విలోని మూడవ వార్డు మారుతి నగర్‌లో నివాసముంటున్న మహ్మద్ హర్శద్దీన్ భార్య కరిష్మా చనిపోయింది. భార్య కరిష్మా పేరు మీద నివాసాన్ని తన పేరుపై మార్చాలని మహ్మద్ హర్శద్దీన్ అధికారులకు వినతిపత్రం అందజేశాడు. అయితే మహ్మద్ హర్శద్దీన్ చనిపోయినట్లు అధికారులు నకిలీ ప్రమాణ పత్రాలను నమోదు చేయడంతో ఇంటిని మార్చేందుకు సాధ్యం కాలేదు. ఈ విషయంలో న్యాయం చేయాలంటూ మహ్మద్ హర్శద్దీన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నగరాభివృద్ధి శాఖ మంత్రి, నగరాభివృద్ధి శాఖ కార్యదర్శి, జిల్లాధికారితో పాటు 22 మంది అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. మనస్థాపానికి గురైన మహ్మద్ హర్శద్దీన్.. తనకు దయా మరణం కల్పించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసినట్లు వివరించారు.
గ్రామస్తులపై తేనెటీగల దాడి
కోలారు : బంగారుపేట తాలూకా భీమగానహళ్లి గ్రామంలో తేనెటీగలు దాడి చేయడంతో పాలువురు గాయపడ్డారు. గ్రామంలోని పాఠశాల సమీపంలోని చెట్టుపై తేనెటీగలు స్థావరం ఏర్పరుచుకున్నాయి. శనివారం గుంపులుగా వచ్చి దాడి చేయడంతో రోడ్లపై తిరుగుతున్న గ్రామస్తులు పరుగులు తీసి ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. తేనెటీగలు విద్యార్థులపై కూడా దాడి చేశాయి. దీంతో పిల్లలు తలుపులు, కిటికీలు వేసుకున్నారు.
మా‘స్టార్’ బీరప్ప సార్
మా‘స్టార్’ బీరప్ప సార్


