
ప్రశాంతంగా పండుగల ఆచరణకు చర్యలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని నాలుగు జిల్లాల్లో ప్రశాంతంగా గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన చేయాలని, గణేష్, ఈద్ మిలాద్ పండుగలకు డీజే వాడకంపై నిషేధం విధించినట్లు బళ్లారి రేంజ్ ఐజీపీ వర్తిక కటియార్ పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాయచూరు, బళ్లారి, కొప్పళ, విజయనగర జిల్లాల్లో ఈనెల 27న వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని, 31న నిమజ్జనం చేయాలన్నారు. ఈద్ మిలాద్ పండుగను హిందూ ముస్లింలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. డీజేల అమరికను పూర్తిగా నిషేధించామన్నారు. రాత్రి 10 గంటల తరువాత డీజేలను వినియోగిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. క్రమం తప్పకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్లాస్టిక్ వస్తువులను వాడరాదని హెచ్చరించారు. సమావేశంలో ఎస్పీ పుట్టమాదయ్య, అదనపు ఎస్పీలు హరీష్, కుమారస్వామి, డీఎస్పీలు తళవార్, దత్తాత్రేయ, శాంతవీర్, సీఐలు నాగరాజ్, నింగయ్య, వీరారెడ్డి, సాబయ్య, ఉమేష్, లక్ష్మి, నరసమ్మ, మంజునాథ్‌తదితరులు పాల్గొన్నారు.
గణేష్, ఈద్ మిలాద్‌లకు డీజే నిషేధం
మండపాల వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలి
బళ్లారి రేంజ్ ఐజీపీ వర్తిక కటియార్ సూచన

ప్రశాంతంగా పండుగల ఆచరణకు చర్యలు