
బైక్‌ను ఢీకొన్న కారు.. అన్నాచెల్లి మృతి
కోలారు వద్ద విషాదం
కోలారు: బైక్‌ను ఇన్నోవా కారు ఢీకొని అన్నా చెల్లెళ్లు ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన మంగళవారం సాయంత్రం నగర సమీపంలోని శ్రీనివాసపురం రోడ్డులో వీరాపుర గేట్ వద్ద చోటు చేసుకుంది. కోలారు తాలూకా కొండేనహళ్లి గ్రామానికి చెందిన హర్షిత్ సింగ్ (20), యశస్విని బాయి (16) చనిపోయిన అన్నా చెల్లెళ్లు.
ఎలా జరిగింది
వివరాలు.. వీరి తల్లిదండ్రులు కూలి పని చేసుకుని జీవిస్తూ పిల్లలు ఇద్దరిని చదివిస్తున్నారు. కూతురు ఇంటర్‌లో చేరగా, కొడుకు డిగ్రీ చదువుతున్నాడు. నిత్యం ఇద్దరు బస్సులోనే వెళ్లేవారు , అయితే చెల్లెలు ఇటీవల టెన్త్ పాసై పీయూసీలో చేరింది, కాలేజీలో అడ్మిషన్ కావలసిన కొన్ని సర్టిఫికెట్‌లు ఇంట్లోనే ఉన్నాయని అన్నకు ఫోన్ చేసి చెప్పగా బైక్‌లో వెళ్లి ఇచ్చాడు. తరువాత ఇద్దరూ బైక్‌లోనే తిరిగి గ్రామానికి వెళుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఓ ఇన్నోవా కారు ఢీకొట్టడంతో అన్నాచెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. హర్షిత్‌సింగ్ ఘటనాస్థలంలోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలికను కోలారు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది. ఇద్దరు పిల్లలను పొగొట్టుకుని అనాథలమయ్యామని పోషకుల ఆక్రందన హృదయవిదారకంగా ఉంది. కోలారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీరు చాలా ఏళ్ల కిందటే ఉత్తరాది నుంచి వలస వచ్చినట్లు తెలిసింది.
హెల్మెట్ లేనందునే: ఎస్పీ
హెల్మెట్ ధరించకపోవడం వల్లనే మరణం సంభవించిందని జిల్లా ఎస్పీ బి.నిఖిల్ తెలిపారు. ద్విచక్రవాహనాలలో వెళ్లేవారు తప్పకుండా తలకు హెల్మెట్ ధరించాలన్నారు.