
సెప్టెంబరు 1న మైసూరుకు రాష్ట్రపతి రాక
మైసూరు: నగరంలో జరిగే అఖిల భారత వాక్ శ్రవణ సంస్థ సిల్వర్ జూబ్లి వేడుకలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 1న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాచనగరికి విచ్చేయనున్నారు. ఆ రోజు మైసూరులోని ఐష్‌లో జరుగనున్న జూబ్లి వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారని ఢిల్లీ నుంచి అధికారిక సమాచారం వెలువడింది. ఆరోజు రాష్ట్రపతి బెంగళూరుకు విచ్చేసి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మైసూరుకు వస్తారని సంస్ఢ డైరెక్టర్ ఎం.పుష్పావతి తెలిపారు. రాష్ట్రపతి ముర్ము మైసూరులో చేస్తున్న రెండో పర్యటన ఇది, 2022 సెప్టెంబర్ 22న మైసూరు దసరా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల గురించి జిల్లాధికారి జీ.లక్ష్మీకాంత్‌రెడ్డి జెడ్పీ సభాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి భద్రతా లోపాలు దొర్లకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
మహిళా లెక్చరర్ దుర్మరణం
కోలారు: స్కూటర్‌పై వెళుతున్న మహిళా అధ్యాపకురాలు డివైడర్‌కి ఢీకొన్న ప్రమాదంలో మరణించిన ఘటన ముళబాగిలు సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. ముళబాగిలు డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలు స్వప్న (40) మృతురాలు. ఆమె ముళబాగిలు సూల్ చంద్ లే అవుట్‌లో నివాసం ఉంటున్నారు. భర్త ఎన్ రామప్రసాద్. స్వప్న పని మీద కోలారు ఉత్తర విశ్వవిద్యాలయ ఆఫీసుకు వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో స్కూటర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆమె ఘటనాస్థలంలోనే కన్నుమూశారు. ప్రమాదం జరగకుంటే కొంతసేపట్లోనే కాలేజీకి చేరుకునేవారే. ముళబాగిలు పోలీసులు మృతదేహాన్ని ముళబాగిలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెద్దసంఖ్యలో విద్యార్థులు, కాలేజీ సిబ్బంది నివాళులర్పించారు.