
వైద్యుల పల్లె బాట
బనశంకరి: సర్కారీ వైద్యులు, సిబ్బంది నగరం, లేదా పట్టణ ప్రదేశాల్లోనే ఉద్యోగం చేస్తుంటారు. పల్లెలకు వెళ్లడం అరుదుగా మారింది. దాని వల్ల గ్రామాల్లో సరిగా వైద్య సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో నగర ప్రదేశాల్లో అనేక ఏళ్లపాటు సేవలందించిన ప్రభుత్వ వైద్యులు, నర్సులతో పాటు ఇతర వైద్యశాఖ సిబ్బంది ఇకపై తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోనూ విధులు నిర్వహించాలని కర్ణాటక రాష్ట్ర సివిల్ సేవల నియంత్రణ సవరించిన బిల్లు బుధవారం విధానసభలో ఆమోదం పొందింది. సవరించిన బిల్లును సభలో ప్రవేశపెట్టి మాట్లాడిన ఆరోగ్యశాఖమంత్రి దినేశ్ గుండూరావ్ నగర ప్రదేశాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, డీ గ్రూప్ సిబ్బంది దీర్ఘకాలం వరకు ఒకేచోట పనిచేస్తున్నారని తెలిపారు. పారదర్శకత తీసుకురావడం కోసం వీరిని బదిలీచేస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారు, దీంతో గ్రామీణ ప్రాంత ఆసుపత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత తలెత్తింది. దీనిని సరిదిద్దడానికి చట్టాన్ని సవరించి అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. అనేక ఏళ్లుగా నగరాలు, పట్టణాల్లో పనిచేసిన సిబ్బంది తప్పనిసరిగా పల్లెల్లోనూ సేవలందించాలని స్పష్టంచేశారు. ఇప్పటికే 5,500 మంది డాక్టర్లు, సిబ్బందిని కౌన్సెలింగ్ ద్వారా బదిలీచేశామని తెలిపారు.
అతివృష్టి వల్ల పంటల నష్టం
మలెనాడు, హాసన్, బెళగావి, కలబుర్గితో పాటు రాష్ట్రంలో తలెత్తిన అతివృష్టితో పంటల నష్టం పట్ల రెవెన్యూ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సమీక్ష చేస్తామని వ్యవసాయ మంత్రి ఎన్.చలువరాయస్వామి విధానసభలో తెలిపారు. జీరో అవర్‌లో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అధిక వర్షాలు పడటంతో వివిధ పంటలు దెబ్బతిన్నాయని, రెవెన్యూ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సర్వే చేసిన తరువాత ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం పరిహారం అందిస్తామని తెలిపారు. ఏప్రిల్, మే నెల నుంచి ఎక్కువ వర్షాలు కురిశాయన్నారు. కలబుర్గి జిల్లాలో పెసర్లు, ఉద్దులతో పాటు అనేక పంటలు దెబ్బతిన్నాయి, గుల్బర్గా జిల్లాకే రూ. 650 కోట్లకు పైగా పంట బీమా పరిహారం అందుతుందని చెప్పారు.
అంతర్గత రిజర్వేషన్లకు ఓకే
ఎస్సీల అంతర్గత రిజర్వేషన్ కు సంబంధించి 19వ తేదీన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నాగమోహన్‌దాస్ కమిటి సిపార్సులను కొన్ని మార్పులతో అంగీకరించామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. మార్పులు అవసరమైతే వాటిని జాతీయ కులగణనలో అంశాలు ఆధారంగా సవరించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. నాగమోహన్‌దాస్ కమిషన్ రాష్ట్రంలో 101 ఎస్సీ కులాలను అధ్యయనం చేసింది, 1,05,09,871 మంది ఎస్సీ కులాల వారి వివరాలు సేకరించారని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ పోరాటదారులపై ఉన్న కేసులను రద్దు చేస్తామని తెలిపారు.
చచ్చినా.. డయాలసిస్ దందా
యశవంతపుర: సినిమాలలో కొందరు వైద్యులు శవానికి వైద్యం చేసి భారీగా ఫీజులు గుంజుతారు. నిజజీవితంలోనూ అలాంటివి జరిగాయి. అదే మాదిరిగా ఎప్పుడో చనిపోయిన వ్యక్తికి డయాలసిస్ చేస్తున్నట్లు డబ్బులు కొట్టేశారని బీజేపీ ఎమ్మెల్యే చన్నబసప్ప విధానసభాలో ఆరోపించారు. బిజాపుర జిల్లా ముద్దేబీహళ ఆస్పత్రిలో ఉచిత డయాలసిస్ వసతి ఉంది. డయాలసిస్ చేసే ఏజెన్సీ ఫిబ్రవరి 15న మరణించిన వ్యక్తి పేరున ఫిబ్రవరి 24 తరువాత డయాలసిస్ చేసినట్లు లెక్కలు చూపించి డబ్బులు తీసుకున్నట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. ఇలా రూ.20, 30 లక్షలు కొట్టేసిందని చెప్పారు. మంత్రి శివానంద పాటిల్ సీరియస్‌గా విచారించి కఠిన చర్యలు తీసుకొంటామని హామీనిచ్చారు.
నగరాలు, పట్టణాల్లో పనిచేసినవారికి బదిలీలు తప్పనిసరి
విధానసభలో కొత్త బిల్లు
పరిషత్‌లో సర్కారుకు ఎదురుదెబ్బ
కర్ణాటక సౌహార్ద సహకార సవరించిన బిల్లు విధాన పరిషత్‌లో తిరస్కరణకు గురికావడంతో ప్రభుత్వానికి ముఖభంగమైంది. సౌహార్ద సహకార బిల్లు కు వ్యతిరేకంగా 26 ఓట్లు, అనుకూలంగా 23 ఓట్లు వచ్చి తిరస్కరణకు గురైంది. మంగళవారం విధానసభలో ఆమోదం పొంది బుధవారం ఎగువసభకు వెళ్లింది. పలు కారణాల వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీల సంఖ్య తగ్గిపోయింది. దీంతో బిల్లు నెగ్గలేకపోయింది.

వైద్యుల పల్లె బాట

వైద్యుల పల్లె బాట