
ఎస్సీ వర్గీకరణకు సర్కారు ఆమోదం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దశాబ్ధాలుగా పెను దుమారంగా మారిన ఎస్సీ ఏబీసీడీ అంతర్గత రిజర్వేషన్ వివాదానికి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపింది. మంగళవారం రాత్రి మంత్రివర్గం ముఖ్యమైన తీర్మానం చేసింది. ఎస్సీల్లో ఎడమ, కుడి అనే రెండు వర్గాలకు చెరో ఆరు శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మిగిలిన కులాలను మూడో వర్గంగా చేర్చి వారికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఇలా మొత్తం మూడు వర్గాలుగా ఎస్సీలను విభజించి రిజర్వేషన్ పంచాలని నిర్ణయించింది.
● గతంలో నాగమోహన్‌దాస్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎస్సీ సముదాయాన్ని ఐదు వర్గాలుగా వర్గీకరణ చేశారు.
● మొదటి వర్గంలో అత్యంత వెనుకబడినవర్గాలకు 10 శాతం రిజర్వేషన్, ఆ తర్వాత ఎస్సీ ఎడమ వర్గానికి 6 శాతం, మూడో కుడి వర్గానికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సిఫారసులు చేసింది.
● నాలుగో వర్గంలో బంజార, భోవి, కురచ, కోరమలకు 4 శాతం, ఇక ఐదో వర్గంలో ఆది కర్ణాటక, ఆది ద్రావిడ, ఆది ఆంధ్రకు 1 శాతం రిజర్వేషన్ కల్పించాలని సూచించింది.
● అయితే సీఎం సిద్ధరామయ్య, మంత్రివర్గం ఐదు వర్గాలుగా కాకుండా మూడు వర్గాలుగా ఎస్సీలను విభజించి రిజర్వేషన్లను ప్రకటించింది.
కమిషన్ లెక్కల ప్రకారం
ఎస్సీ కులాలు, వాటి జనసంఖ్య
● వర్గం ఏ– మొత్తం 59 ఉప కులాలు ఉన్నాయి ఈ వర్గంలో మొత్తం 5,22,099 మంది ప్రజలు ఉన్నారు.
● వర్గం బీ (ఎడమ) – 18 ఉప కులాలు ఉన్నాయి. 36,69,246 మంది ప్రజలు ఉన్నారు.
● వర్గం సీ (కుడి) – 17 ఉప కులాలు ఉన్నాయి. మొత్తం జనాభా 30,08,633
● వర్గం డీ – నాలుగు ఉప కులాలు ఉన్నాయి. మొత్తం జనాభా 28,34,939
● వర్గం ఈ – మూడు ఉప కులాలు (ఆది కర్ణాటక, ఆది ద్రావిడ, ఆది ఆంధ్ర). జనాభా 4,74,954
హర్షం.. అసంతృప్తి
ఈ నేపథ్యంలో విధానసౌధలో సీఎం సిద్ధరామయ్యను దళిత సంఘాల నేతలు సన్మానించారు. ఫ్రీడం పార్కులో దళిత సముదాయ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అయితే మూడో వర్గం అయిన ఇతర ఎస్సీ కులాల నేతలు అసంతృప్తితో ఉన్నారు.
కుడి, ఎడమ వర్గాలకు 6 శాతం
చొప్పున రిజర్వేషన్లు
మూడో వర్గంలోని కులాలకు 5 శాతం
కేబినెట్ తీర్మానం
ఎడమ వర్గం దళిత కులాలు ఏవంటే..
భాంబి, అసదరు, అసోడి, చమడియా, చమర్, చంబర, చమగార, హరళయ్య, హరళి, ఖాల్ప, మచిగార, మోచిగార, మాదర, మాదిగ, మోచి, ముచ్చి, తెలుగు మోచి, కామతి మోచి, రాణిగార్, రోహిదాస్, రోహిత్, సమ్గర్, హక్కళయ దోర్క హలస్వర, హస్ల, కడయ్యన్, కెప్మరిన్, కొలుపుల్వండియు, కుటుంబన్, మావిలన్, మోగేర్, పంచమ, పన్నియాండి, పరయ్యన్, పరయ, సమగార, సాంబన్
కుడి వర్గం దళిత కులాలు
అణముక్, అరరెమాళ, అరవ మాళ, బలగై, ఛలవాది, చెన్నయ్య, పల్లన్, హోలయ, హోలెయ, మహ్యవంశీ, దేడ్, వంకర్, మారు వంకర్, మాళ, మలహణ్ణాయి, మాళ జంగమ, మాళ మాస్తి, మల మారాట, నెట్కణి, మహార్, తరళ్, ధేళు, దేగుల, ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, ఆది కర్ణాటక.

ఎస్సీ వర్గీకరణకు సర్కారు ఆమోదం