
పిల్లల ముఖ హాజరుకు మేధావుల విముఖం
సాక్షి, బెంగళూరు: ప్రైవేటు రంగమే కాదు ప్రభుత్వ రంగంలోనూ ఐటీ సాంకేతికత విస్తృతంగా వాడుకలోకి వస్తోంది. కర్ణాటక పాఠశాల విద్యా శాఖ కూడా విద్యార్థుల హాజరును ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ (ఎఫ్‌ఆర్‌ఏ) ద్వారా రికార్డు చేయాలని తీర్మానించింది. పాఠశాలలో ఒక పరికరాన్ని అమర్చుతారు, అందులో ముఖం చూపిస్తే హాజరు నమోదవుతుంది. 2025–2026 ఏడాదిలోనే దీన్ని ప్రయోగాత్మక ప్రాజెక్టుగా కొన్ని పాఠశాలల్లో అమలు చేయాలని నిర్ణయించినా ఇంకా అమలుకు నోచుకోలేదు. ఆదిలోనే హంసపాదు పలువురు విద్యా నిపుణులు, పౌర సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
అభ్యంతరాలు ఏమిటి
● బడుల్లో పిల్లల హాజరును ఫేషియల్ రికగ్నేషేన్ ద్వారా రికార్డు చేసి దాన్ని స్టూడెంట్ అచీవ్‌మెంట్ ట్రాకింగ్ సిస్టమ్ (శాట్స్)లో అప్‌లోడ్ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.
● 31 మంది నిపుణులతో కూడిన బృందం ఎఫ్‌ఆర్‌ఏని వ్యతిరేకిస్తూ సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ప్రయోజనాలు సరే, ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు.
● విద్యార్థుల వివరాలు, ఫోటోలతో కూడిన సమాచారాన్ని ఎవరైనా దుర్వినియోగం చేవయచ్చని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలగవచ్చునని హెచ్చరించారు.
● శాట్స్‌లో విద్యార్థుల ఫోటోలు మాత్రమే కాకుండా పిల్లల అభిరుచులు, ఆసక్తి తదితర వివరాలను తెలుసుకోవచ్చని, ఈ సమాచారం ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం ఉందని, ఎవరైనా దుర్వినియోగం చేయవచ్చునని అభ్యంతరం వ్యక్తం చేశారు.
● ఇలా అవాంతరాలు రావడంతో ప్రభుత్వం ఫేషియల్ విధానం అమలుపై మీనమేషాలు లెక్కిస్తోంది.
విద్యార్థుల సమాచారం
దుర్వినియోగం కావచ్చని హెచ్చరిక

పిల్లల ముఖ హాజరుకు మేధావుల విముఖం