
బెళగావికి ముంపు బెంగ
శివాజీనగర: బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల రాష్ట్రంలో పలు జిల్లాల్లో వరుణ ఆర్భాటం కొనసాగుతోండగా, ముంపు ప్రమాదం ఏర్పడింది. బెళగావి జిల్లా రామదుర్గ పట్టణం నింగాపురపేటలో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం వల్ల ఇంటి కప్పు కూలిపోయి వామనరావు బాపు పవార్ అనే వృద్ధుడు చనిపోయాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది శిథిలాలను తొలగించి మృతదేహాన్ని వెలికితీశారు. గోకాక్ పట్టణం, పరిసరాల్లో పలుచోట్ల లోతట్టు ప్రదేశాలు నీటమునిగాయి. గోకాక్ వద్ద లోలాసుర్ వంతెన నీటమునగడంతో పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. ముంపు ప్రదేశాల నుంచి బాధితులను గోకాక్‌లోని వసతి కేంద్రానికి తరలించారు. కనీస వసతుల్లేవని వారు మండిపడ్డారు.
ఉత్తర కర్ణాటకలో..
బాగలకోట, ఉత్తర కన్నడ, ధారవాడ జిల్లాల్లో జడివానలు పడుతున్నాయి. బీదర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కారంజి జలాశయం భర్తీ అయింది. బాల్కి తాలూకాలోని కట్టితుంగావ్ గ్రామంలో మల్లికార్జున దేవాలయం జలావృతమైంది. హావేరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల ప్రభుత్వ పాఠశాల గదులు నీళ్లు కారి దుస్థితికి చేరాయి. విద్యార్థులు వరండాలలో కూర్చున్నారు. కొప్పళ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాలు బురదమయ్యాయి. బాగలకోట, విజయపుర జిల్లాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఆల్మట్టి డ్యాం కి ఇన్‌ఫ్లో పెరిగింది. 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నదికి అటు ఇటు ఉన్న ప్రాంతాల ప్రజలు ముంపు భయంతో జీవిస్తున్నారు.
వెంటాడుతోన్న కుంభవృష్టి
వంతెనలు, జనావాసాలు జలమయం
ఇల్లు కూలి ఒకరు మృతి

బెళగావికి ముంపు బెంగ

బెళగావికి ముంపు బెంగ