విహారయాత్రలో విషాదం | - | Sakshi
Sakshi News home page

విహారయాత్రలో విషాదం

Apr 26 2025 12:50 AM | Updated on Apr 26 2025 12:50 AM

విహార

విహారయాత్రలో విషాదం

ఇద్దరు వైద్య విద్యార్థినుల మృతి

ఉత్తర కన్నడ జిల్లాలో ఘోరం

యశవంతపుర: విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు తమిళనాడుకు చెందిన మెడికల్‌ విద్యార్థులు సముద్రంలో మునిగి మృత్యువాత పడ్డారు. ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ వద్ద మెడికల్‌ విద్యార్థులు కాంజిమోళి, సింధుజా మృతి చెందారు. విద్యార్థులను రక్షించటానికి స్థానికులు అనేక ప్రయత్నాలు చేశారు. జోరుగా అలలు రావటంతో రక్షించటానికి సాధ్యం కాలేదు. మృతులు తమిళనాడులోని తిరుచ్చి మెడికల్‌ కాలేజీలో చివరి సంవత్సరం మెడిసిన్‌ చదువుతున్నట్లు తెలిసింది. అనంతరం తీర రక్షణ దళం గాలించి మృతదేహాలను వెలికి తీశారు. గోకర్ణ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు.

సీసీబీ పోలీసుల కస్టడీకి

ఓంప్రకాష్‌ సతీమణి

బనశంకరి: విశ్రాంత డీజీపీ ఓంప్రకాష్‌ హత్యకేసులో కటకటాల పాలైన ఆయన సతీమణి పల్లవిని సీసీబీ పోలీసులు 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. పల్లవిని మే 3 తేదీవరకు కస్టడీకి ఇవ్వాలని ఓంప్రకాష్‌ హత్యకేసు దర్యాప్తు చేపడుతున్న సీసీబీ ఏసీపీ దర్మేంద్ర నేతృత్వంలోని బృందం బెంగళూరు 39 ఏసీఎంఎంకోర్టుకు విన్నవించింది. దీంతో పల్లవిని 7 రోజులు కస్టడీకి ఆదేశిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఓంప్రకాష్‌ హత్యకేసులో ఏ2 ఆరోపిగా ఉన్న కుమార్తె కృతి మానసిక అస్వస్థతకు గురికావడంతో నిమ్హాన్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు.

ఒకే నెలలో శ్రీకంఠేశ్వరునికి రూ.2.59 కోట్ల కానుకలు

మైసూరు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నంజనగూడులో వెలిసిన శ్రీకంఠేశ్వర స్వామి వారి సన్నిధిలోని హుండీల్లో భక్తుల నుంచి వచ్చిన కానుకలను శుక్రవారం లెక్కించారు. నెల రోజుల వ్యవధిలో స్వామివారికి నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీతో పాటు సుమారు రూ.2.59 కోట్లు కానుకలుగా వచ్చాయి. శ్రీకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉన్న దాసోహ భవనంలో ఆలయ సిబ్బంది, బ్యాంకు అధికారులు కలిసి సీసీ టీవీ కెమెరాల పకడ్బందీ నిఘా మధ్య హుండీల్లోని కానుకలను లెక్కించారు. ఆలయ హుండీల్లో 2 కోట్ల 59 లక్షల 46 వేల 79 రూపాయల నగదు, 103 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 3 కిలోల 300 గ్రాముల వెండితో పాటు అరబ్‌ ఎమిరేట్స్‌ 15, యూరో 1, సౌదీ అరేబియా 1, మలేషియా 1, కెనడా డాలర్‌ 1, ఒమన్‌ 2, ఇంగ్లండ్‌ పౌండ్లు 2, అమెరికా డాలర్‌ 1తో కలిపి మొత్తం 24 కరెన్సీ నోట్లు స్వామివారికి కానుకగా లభించాయని ఆలయ ఈఓ జగదీష్‌ కుమార్‌ తెలిపారు.

ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని ఎవరు అడిగారు?

స్మార్ట్‌మీటర్ల ధరకు సంబంధించి

ప్రభుత్వంపై హైకోర్టు మండిపాటు

బనశంకరి: కొత్తగా నిర్మించిన ఇంటికి స్మార్ట్‌మీటరు అమర్చుకోవాలని డిమాండ్‌ చేసిన బెస్కాం ఇచ్చిన లేఖపై స్టే ఇచ్చిన హైకోర్టు స్మార్ట్‌ మీటర్లు ధర నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వంపై మండిపడింది. స్మార్ట్‌మీటరు అమర్చుకోవాలని డిమాండ్‌ చేస్తూ దొడ్డబళ్లాపుర అసిస్టెంట్‌ ఇంజినీర్‌ జయలక్ష్మి ఇచ్చిన లేఖను ప్రశ్నిస్తూ వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి ఎం.నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం లేఖపై స్టే ఇచ్చింది. అంతేగాక ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఉద్దేశిస్తూ హైకోర్టు ధర్మాసనం వీటన్నింటికీ ఉచిత గ్యారంటీలతో తలెత్తే సమస్యలపై ప్రశ్నించింది. ఉచితంగా విద్యుత్‌ కావాలని ఎవరు అడిగారు. పేదలకు ఒక్కసారిగా ఈవిధంగా ధర పెంచితే ఎక్కడికి వెళ్లాలి. అందరూ అధిక మొత్తంలో డబ్బులిచ్చి స్మార్ట్‌మీటర్లు అమర్చుకోవాలంటే పేదలు ఏం చేయాలంటూ ప్రశ్నించింది. వాదప్రతివాదనలు ఆలకించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వం, బెస్కాం తరఫున న్యాయవాదికి నోటీస్‌ జారీ చేసి విచారణ జూన్‌ 4వ తేదీకి వాయిదా వేసింది.

విహారయాత్రలో విషాదం 1
1/2

విహారయాత్రలో విషాదం

విహారయాత్రలో విషాదం 2
2/2

విహారయాత్రలో విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement