తండ్రీ కూతుర్ని చిదిమిన కంటైనర్
చిక్కబళ్లాపురం: తాలూకా పరిధిలోని బెంగళూరు– హైదరాబాద్ హైవేలో లింగశెట్టిపురం వద్ద కంటైనర్ లారీ అదుపుతప్పి బైక్ మీద పడింది. ఈ దుర్ఘటనలో స్థానిక బండహళ్లికి చెందిన వెంకటేశ్ (40), కూతురు దీక్ష (4) దుర్మరణం చెందారు, భార్య రూప (35) తీవ్ర గాయాల పాలైంది. వివరాలు..శనివారం సాయంత్రం వీరు ఇంటి నుంచి బయల్దేరారు. ఈశా ఫౌండేషన్ రోడ్డు నుంచి రహదారి మీదకు వచ్చారు, ఓ కారు కూడా వీరి పక్కనే ప్రయాణిస్తోంది. బాగేపల్లి వైపు నుంచి వచ్చిన కంటైనర్ లారీ, ఆకస్మికంగా వచ్చిన కారును తప్పించబోయి అదుపుతప్పి ఎడమపక్కకు బోల్తా పడింది. అక్కడే బైక్‌లో వెంకటేశ్ కుటుంబం వెళ్తోంది. ముగ్గురూ కంటైనర్ కింద చిక్కారు. తండ్రీ బిడ్డ క్షణాల్లో మరణించారు. రూపాను స్థానికులు రక్షించి బెంగళూరుకు తరలించారు. చిక్కబళ్లాపురం రూరల్ పోలీసులు చేరుకుని పరిశీలించారు. ఈశా ఫౌండేషన్ మార్గంలో వందలాది వాహనాలు సంచరిస్తూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఇక్కడ అండర్‌పాస్ వంటివి నిర్మించి ప్రమాదాలను తప్పించాలని ప్రజలు కోరారు.
చిక్కబళ్లాపురం వద్ద ఘోరం
తండ్రీ కూతుర్ని చిదిమిన కంటైనర్


