● రూ.20 లక్షల నగదు దోచిన దుండగులు
రాయచూరు రూరల్: సినిమా ఫక్కీలో ఆటో డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి బ్యాంక్ నుంచి భార్యతో రూ.20 లక్షలు డ్రా చేయించుకొని నగదుతో దొంగల ముఠా పరారైన ఘటన కలబుర్గిలో ఆలస్యంగా వెలుగు చూసింది. మార్చి 13న ఆటో డ్రైవర్ మల్లయ్య స్వామి నందికూరు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన నలుగురు ముఠా సభ్యులు తమ వాహనంలో తీసుకెళ్లినట్లు బాధితుడు మల్లయ్యస్వామి వెెల్లడించారు. ఆటో డ్రైవర్ మల్లయ్య స్వామి ఆటో నడుపుతూ, భార్య లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారమన్నారు. బ్యాంక్‌లో రూ.30 లక్షల డబ్బులు దాచుకున్న విషయం తెలుసుకున్న ముఠా సభ్యులు కిడ్నాప్ చేసి తనను నడవడానికి కూడా వీలు లేని విధంగా చితకబాదారన్నారు. కలబుర్గి బసవనగరలోని నివాసంలో ఉంచి బ్యాంక్ నుంచి రూ.30 లక్షలు డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని లేక పోతే ప్రాణాలతో దక్కవని బెదిరించారన్నారు. ఈ విషయంపై భార్యకు ఫోన్ చేసి జూదంలో ఓడిపోయానని రూ.20 లక్షలు కట్టాలని చెప్పానన్నారు. చివరికి భార్యను కూడా అపహరించి ఆమెను భయపెట్టి ఆమె చేతుల మీదుగా రూ.20 లక్షలు డ్రా చేయించుకొని పరారయ్యారన్నారు. గాయపడ్డ తనను చికిత్స కోసం భార్యతో పాటు వారు మహారాష్ట్రలోని షోలాపూర్ ఆస్పత్రుల చుట్టు తిప్పుతూ చివరకు కలబుర్గిలో దించి వెళ్లిపోయారన్నారు. ఈ ఘటనపై కలబుర్గి పోలీసులకు ఫిర్యాదు చేసినా మౌనంగా ఉన్నారని ఆరోపించారు.