హుబ్లీ: జిల్లాలోని నవలగుంద తాలూకా యమనూరు గ్రామంలో రాజా బాగసావర సాంగదేవ జాతర గంధాభిషేకం సందర్భంగా మహారాష్ట్రకు చెందిన సాధువులు ఆలయం నుంచి ప్రదర్శన ద్వారా బెన్నిహళ్ల వాగుకు వెళ్లి పూజలు జరిపి అక్కడి నుంచి నీటిని తెచ్చి దీపాన్ని వెలిగించారు. గంధాభిషేకం జాతరకు నవలగుంద ఎమ్మెల్యే ఎన్‌హెచ్ కోనరెడ్డి శ్రీకారం చుట్టారు. బెన్నిహళ్ల వాగుకు మెట్ల నిర్మాణంతో పాటు తొలిదశలో రూ.12 కోట్ల వ్యయంతో అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. టీపీ ఈఓ, యమనూరు పీడీఓ భాగ్యశ్రీ జాగీర్‌దార్, సీఐ రవి, ఎస్‌ఐ జనార్ధన్, ఆలయ పెద్దలు వినోద్‌రావ్ బర్గే, దత్తాజిరావ్ బర్గే, సురేష్‌రావ్ బర్గే తదితరులు పాల్గొన్నారు. ఈ జాతర హిందు, ముస్లిం సామరస్యానికి ప్రతీకగా ప్రతి ఏటా భారీ సంఖ్యలో భక్తుల సమక్షంలో జరుగుతోంది. వివిధ చోట్ల నుంచి పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులు బెన్నిహళ్ల జలాశయంలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.