శివాజీనగర: రాష్ట్రంలో శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, రాష్ట్రంలో చెప్పేవారు లేరు, అడిగేవారు లేరు. గూండా రాష్ట్రంగా మారింది అని మంగళవారం అసెంబ్లీ విధానసభలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో సర్కారుపై ధ్వజమెత్తారు. బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ శాంతిభద్రతల మీద వాయిదా తీర్మానంలో ప్రసంగించారు. బిడది వద్ద టొయోటా కంపెనీలో గోడపై పాకిస్తాన్ అనుకూల నినాదాలు, కన్నడిగులకు వ్యతిరేకంగా అసభ్యకరమైన పదజాలంతో రాశారన్నారు. ఇది ప్రతి ఒక్కరూ తల దించుకునే విషయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, శాంతిభద్రతలకు గురించి పట్టింపు లేనట్లుంది, హోంశాఖను జిల్లా ఇన్‌చార్జి మంత్రి చూస్తున్నారని పరోక్షంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను విమర్శించారు. బిడది ఘటనలో దుండగులను సీసీ కెమెరాలు తనిఖీ చేసి తక్షణమే పట్టుకోవాల్సింది. అయినా కూడా ప్రభుత్వం మౌనంగా ఉందని ధ్వజమెత్తారు. హోలీ పండుగ సమయంలో రాణి బెన్నూరులో లవ్ జిహాద్ సంఘటన జరిగిందని ఆరోపించారు. స్వాతి అనే నర్సును తీసుకెళ్లిన నయాజ్ అనే వ్యక్తి ఆమె మెడకు టవల్‌తో బిగించి హత్య చేసి మృతదేహాన్ని తుంగా నదిలోకి పారవేశారు. మూడు రోజుల తరువాత ఆమె మృతదేహం బయటపడింది. మరణోత్తర పరీక్షలో హత్య అని తెలిసింది. అయితే పోలీసులు ఆమె తల్లికి చెప్పకుండా శవాన్ని కాల్చివేశారు అని దుయ్యబట్టారు. గతంలో కలబుర్గిలో విద్యార్థిని నేహా హత్యకు గురైనపుడు పోలీసులు జాగ్రత్త తీసుకుని ఉంటే ఇటువంటి ఘటనలు మళ్లీ జరిగేవి కావన్నారు.
హంపీలో పర్యాటకులు వెళ్లిపోతున్నారు
విదేశీయులు కర్ణాటకను మెచ్చుకొంటున్నారని ప్రభుత్వం చెబుతోంది, అలాంటి విదేశీయులపైనే హంపీలో మూకుమ్మడి అత్యాచారం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యేలు కేకలు వేశారు. అశోక్ స్పందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాత పొందిన హంపిలోనే ఇలా జరిగితే ఎలా? 60 శాతం ఇజ్రాయెల్ పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం జరిగిన తరువాత పర్యాటకులు హంపిలో హోం స్టేలను ఖాళీ చేస్తున్నారు. హంపికి చెడ్డపేరు వచ్చింది. ప్రభుత్వం హోం స్టేలకు రిజిస్ట్రేషన్ సంఖ్యను జారీ చేస్తామంటోంది. శాంతిభద్రతలు అధ్వాన్నస్థితికి చేరుకొంటుంటే, ముఖ్యమంత్రి ఏదో చెబుతూ దారి తప్పిస్తున్నారని ఆరోపించారు. బెంగళూరుకు ఎవరో ప్రముఖులు వస్తే గ్యారెంటీ పథకాలను పొగిడేందుకు వచ్చారని ముఖ్యమంత్రి చెప్పడం సరికాదని హేళన చేశారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వ గౌరవం పోతోంది. అయినా కూడా మౌనంగా ఉంది. బంగారం స్మగ్లింగ్‌లో మంత్రుల పేరు వచ్చినా కూడా కదలిక లేదు. దీనిపై విస్తృతంగా చర్చ జరగాలి అని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
పాకిస్తాన్‌కు మద్దతు రాతలు, అత్యాచారాలపై చర్యలేవీ?
నేరాలతో రాష్ట్రం అతలాకుతలం
విధానసభలో బీజేపీ సభ్యుల ధ్వజం
శాంతిభద్రతలు అసలున్నాయా?